ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, దుగ్గిరాల బాల రావమ్మ తల్లి ఆలయ మాజీ చైర్మన్ వీరంకి వీరాంజనేయులు(55) ప్రమాదవశాత్తు మామిడి చెట్టుపై నుంచి కాలుజారి కింద పడి మృతి చెందాడు. గురువారం రాత్రి వీరాంజనేయులు తన మామిడితోటలో చెట్టు ఎక్కి మామిడికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయాడు. తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆయన మృతదేహానికి వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు బెజవాడ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బెజవాడ శ్రీహర్ష, గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి శరత్, వీరాంజనేయులు పాల్గొన్నారు.
కామవరపుకోట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి తడికలపూడిలో చోటు చేసుకుంది. తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు శనివారపేటకు చెందిన బెల్లాని సతీష్ (34) గురువారం సొంత పని మీద శనివారపుపేట ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి జంగారెడ్డిగూడెం వెళ్లి అదే రోజు రాత్రి తిరిగి ప్రయాణమై ఇంటికి వస్తుండగా తడికలపూడి సెంటర్‌లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సతీష్ తలకు తీవ్ర గాయాలై అక్కడే మృతి చెందాడు. మృతుడు సోదరుడు బెల్లాని రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వల్లి పద్మ తెలిపారు.
జంగారెడ్డిగూడెం: ఎర్రకాలువ జలాశయం నుంచి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న రెండు మట్టి లారీలను సీజ్ చేసినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. రాత్రి సమయాల్లో జలాశయం నుంచి మట్టిని తరలిస్తుండడంతో రెండు లారీల ను సీజ్ చేసి రెవెన్యూ శాఖకు తెలిపామన్నారు. తహసీల్దార్ కె.స్లీవజోజి ఒక్కొక్క లారీకి రూ. 10వేలు జరిమానా విధించినట్లు ఎస్సై చెప్పారు.
ముదినేపల్లి(కై కలూరు): తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించడానికి గుడివాడ వెళ్లిన భార్య, కుమార్తె కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి శుక్రవారం ముదినేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. వారు తెలిపిన వివరాల ప్రకారం పెదపాలపర్రు గ్రామంలో చిట్టెం చౌదరీ, భార్య నాగరాణి(31), కుమార్తె యస్విక(5) నివసిస్తున్నారు. చౌదరీ సోదరుడు వివాహం శనివారం జరగనుంది. దీంతో గురువారం పొలంలో అమ్మిన మినుములు డబ్బులు రూ.50 వేలను భార్య నాగమణికి ఇచ్చి గుడివాడలో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకుని రావడంతో పాటు కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పాడు. దీంతో తల్లి, కూతురు గుడివాడ వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు వారు తిరిగి రాకపోవడంతో గుడివాడలో బంగారు కొట్టు యజమానితో మాట్లాడితే భర్త పేరుతో తాకట్టు ఉందని, ఆయన రావాలని చెప్పడంతో నాగమణి వెళ్లిపోయినట్లు చెప్పారు. దీంతో గాలించిన భర్త ఇద్దరూ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాలకొల్లు సెంట్రల్: మండలంలోని కాపవరం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గూడూరి వెంకరమణ వైద్య చికిత్స నిమిత్తం గత నెల 27 న హైదరాబాద్ వెళ్లి శుక్రవారం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న ఐదు కాసులు బంగారం, 400 గ్రాములు వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై సురేంద్రకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమడోలు: తన భర్త తనును శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ భార్య శుక్రవారం భీమడోలు పోలీసులను ఆశ్రయించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎం పురానికి చెందిన యాగంటి జ్యోతిర్మయి అనే మహిళ అదే గ్రామానికి చెందిన రొంటపల్లి ఏసుపాదాన్ని 2017లో రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం కతార్ నుంచి ఇంటికి వచ్చిన భర్త ఏసుపాదం భార్య యాగంటి జ్యోతిర్మయిని అదనపు కట్నం తేవాలని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆమె తన భర్తపై భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


