మట్టి నమూనా జాగ్రత్తగా తీయాలి
● భూసార పరీక్షలతోనే సాగులో సిరి సంపదలు
● మెట్ట ప్రాంతంలో మట్టి నమూనాల సేకరణ
చింతలపూడి: ‘ఏరువాక సాగే ముందు.. నేల తల్లి నాడి చూడాలి’ అనే నినాదంతో వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. సాగు ఖర్చులు తగ్గించుకుంటూ, అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. 2025–26 ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో చింతలపూడి సబ్ డివిజన్ పరిధిలోని రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేయించుకోవడం ద్వారా లాభదాయక వ్యవసాయానికి బాటలు వేసుకుంటున్నారు. చింతలపూడి సబ్ డివిజన్ పరిధిలో చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నర్సాపురం మండలాల్లో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 5,680 మట్టి నమూనాలను సేకరించారు. ఈ ఏడాది రసాయన రహిత సాగు వైపు మళ్లుతున్న ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి కూడా 4,045 నమూనాలను సేకరించి భూసార పరీక్షలకు పంపారు.
భూసార పరీక్షలతో ఎంతో మేలు
మట్టి నమూనాల పరీక్ష ద్వారా రైతులకు అందే ‘భూసార ఆరోగ్య పత్రం’ సాగులో దిక్సూచిలా పని చేస్తుంది. భూమిలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో? ఏవి ఎక్కువగా ఉన్నాయో?తెలుస్తుంది. దీనివల్ల అనవసరంగా ఎరువులు వాడి డబ్బు వృథా చేయాల్సిన పని ఉండదు. యూరియా,డీఏపీ వంటి ఎరువులను మోతాదుకు మించి వాడకుండా నిరోధించవచ్చు. ఫలితంగా పెట్టుబడి ఖర్చు 20 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. మితిమీరిన రసాయనాల వినియోగం వల్ల చవుడు భూములుగా మారుతున్న నేలలను రక్షించుకోవచ్చు. భూమిలోని ఉదజని సూచిక లవణ సాంద్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. పంటకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (జింక్, బోరాన్, ఇనుము వంటివి) అందించడం వల్ల గింజ గట్టిపడి, దిగుబడి పెరుగుతుంది.
పొలంలో మట్టి నమూనా తీసేటప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలం మధ్యలో కాకుండా, పొలం అంతటా 15 నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిని సేకరించాలి. చెట్ల కింద, గట్ల పక్కన, ఎరువులు వేసిన చోట మట్టిని సేకరించకూడదు. రైతులు గుడ్డిగా ఎరువులు వేసి నష్టపోకూడదనే ఉద్దేశంతో చింతలపూడి సబ్ డివిజన్ వ్యాప్తంగా నమూనాల సేకరణ చేపట్టాం. ఆరోగ్యకరమైన నేల నుంచే నాణ్యమైన ఆహారం లభిస్తుందని ప్రతి రైతు గుర్తించాలి.
– వై.సుబ్బారావు,
వ్యవసాయ శాఖ ఏడీ, చింతలపూడి సబ్ డివిజన్


