● 3 నెలలుగా బాలికపై లైంగిక దాడి..
● గర్భనిరోధక మాత్రలు వేయడంతో
బాలికకు తీవ్ర అస్వస్థత
● కామవరపుకోట మండలంలో దారుణం
కామవరపుకోట: పాస్టర్ ముసుగులో ఓ కామాంధుడు 14 ఏళ్ల బాలికను చెరబట్టాడు. భక్తి ముసుగులో పాస్టర్ అవతారమెత్తిన కీచకుడు బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం కామవరపుకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన సీహెచ్ రాంబాబు అలియాస్ హోసన్న కూలీ పనులు చేసుకుంటూ, పాస్టర్‌నని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అతడి భార్య కొన్నేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రాంబాబు కొంతకాలంగా ఓ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ ఇంట్లోని బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మూడు నెలలుగా తన ఇంటికి బాలికను రప్పించుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక గర్భం దాల్చిందనే అనుమానంతో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా పాస్టర్ రాంబాబు మోతాదుకు మించి గర్భ నిరోధక మాత్రలు వేయడంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో బాలికను తల్లిదండ్రులు ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్య నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది బాలికను ఆరా తీయడంతో పాస్టర్ రాంబాబు బండారం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఏలూరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాలిక పరిస్థితి చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నిందితుడు రాంబాబుకు కఠిన శిక్ష పడాలని పలువురు కోరుతున్నారు.


