మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

అత్తిలి: మద్యం మత్తులో కన్న కొడుకునే కత్తెరతో పొడిచి చంపిన ఘటన శుక్రవారం సాయంత్రం అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్ధానికుల కథనం ప్రకారం పాలకొల్లుకు చెందిన కొయ్యన గణేష్‌తో అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన శేషవేణితో వివాహమైంది. వివాహం అనంతరం గణేష్‌ అత్తవారింటికి వచ్చి ఇక్కడే జీవిస్తున్నాడు. ఇతనికి కుమారుడు శామ్యూల్‌రాజు, కుమార్తె జాహ్నవి ఉన్నారు. గణేష్‌ రొయ్యల చెరువుల్లో వాడే ఎయిరేటర్స్‌ మోటార్ల మరమ్మతులు చేస్తుంటాడు. కుమారుడు శామ్యూల్‌రాజు(21) ఐటీఐ చదివి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన గణేష్‌ నిత్యం భార్యతో గొడవపడుతూ, వేధిస్తుంటాడు. అయితే శుక్రవారం తండ్రీకొడుకులు ఇద్దరూ మోటార్ల మరమ్మతుల నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చారు. మద్యం మత్తులో ఉన్న గణేష్‌, భార్యతో గొడవకు దిగాడు. తల్లిదండ్రుల గొడవ నేపథ్యంలో కుమారుడు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. విచక్షణ కోల్పోయిన తండ్రి గణేష్‌ అకస్మాత్తుగా వచ్చి మంచంపై పడుకున్న కొడుకు శామ్యూల్‌రాజు ఛాతిపై పలుమార్లు విచక్షణారహితంగా కత్తెరతో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శామ్యూల్‌రాజు మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంఘటనా ప్రదేశానికి అత్తిలి పోలీసులు చేరుకుని వివరాలను సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement