సమగ్ర శిక్షా.. మాపై ఎందుకీ కక్ష? | - | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్షా.. మాపై ఎందుకీ కక్ష?

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

డిమాండ్లు

పాదయాత్ర జయప్రదం చేయండి

కనీస వేతనాలు అమలు చేయండి

● సమగ్ర శిక్షాలో ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులర్‌ చేయాలి.

● హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి.

● సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

● కనీస వేతనం, ఇంటి అద్దె, కరవు భత్యం అమలు చేసి, వేతనాలు పెంచాలి.

● అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి.

● రూ.10 లక్షలు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌, గ్రాడ్యుటీ కల్పించాలి.

● ఈపీఎస్‌, ఈఎస్‌ఐ అమలు, పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి.

● మహిళలకు చైల్డ్‌ కేర్‌ సెలవులు మంజూరు చేయాలి.

● మరణించిన ఉద్యోగి కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలకు పెంచి, కారుణ్య నియమకాలు చేపట్టాలి.

● డీఎస్‌సీలో ప్రభుత్వ రెగ్యులర్‌ పోస్టుల నియామకాల్లో వెయిటేజ్‌ ఇవ్వాలి.

కై కలూరు: సమగ్ర శిక్షాలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తాం.. సమాన పనికి సమాన వేతనం అందిస్తాం.. రానున్నది మంచి ప్రభుత్వం.. అంటూ సమ్మె చేస్తున్న సిబ్బందిని ఉద్దేశించి యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్న మాటలివీ. ఇప్పుడు సీన్‌ రివర్స్‌.. వేతనాల పెంపు కేంద్రం పరిధిలోనిది. అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన వేతనాలు ఏపీలో ఇస్తున్నాం.. కేజీబీవీ టీచర్లు హైకోర్టు ద్వారా తెచ్చుకున్నా ఎంటీఎస్‌ అమలు తీర్పుపై చంద్రబాబు ప్రభుత్వం రివ్వూ పిటిషన్‌, పొమ్మనలేక పొగబెట్టే చర్యలు సిబ్బందిపై ప్రయోగం.. నేటి స్థితి ఇది.. ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(జేఏసీ) పిలుపుతో ఈనెల 15న కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ కరకట్ట నుంచి విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఇంటి వరకు శాంతియుత పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్షా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 25 వేల మంది పాల్గొంటున్నారని అంచనా. ఏలూరు జిల్లా విద్యాశాఖ పరిధిలో పనిచేసే కేజీబీవీ, డీపీఓ, ఏపీసీ, ఎంఈవో, భవిత సెంటర్లులో పనిచేసే సీఆర్పీలు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, మెసేంజర్లు, ఐఈఆర్‌టీలు, టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, ఆయాలు, ఫిజియోథెరపిస్టులు, మండల లెవెల్‌ అకౌంటెంట్లు ఇలా అందరూ కలపి మొత్తం 464 మంది పనిచేస్తున్నారు. వీరంతా కనీస వేతనాల కోసం పోరాడుతున్నారు.

పని బారెడు.. జీతం మూరెడు

సమగ్ర శిక్షాలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పొమ్మనలేక పొగపెట్టే కార్యక్రమం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఈవో కార్యాలయాల్లో మండల లెవిల్‌ అకౌంటెంట్లు (ఎంఎల్‌ఏ) అనేక కేంద్రాల్లో మూడు చోట్ల పనిచేస్తున్నారు. ఉదాహరణకు మండవల్లి మండలం మండవల్లిలో పనిచేసే అకౌంటెంటుకు నూజివీడు బాధ్యత అప్పగించారు. ట్రావెలింగ్‌ అలవెన్సు కూడా వీరికి ఉండదు. అదే విధంగా వర్క్‌ ఎడ్జస్ట్‌మెంటు కింద సీఆర్‌పీలకు కొన్ని చోట్ల 100 కిలోమీటర్ల దూరంలో విధులు కేటాయిస్తున్నారు. నిత్యవసర ధరలు పెరిగిన నేపథ్యంలో తమ జీతాలు ఏ మూలకు చాలటం లేదని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

కేంద్రంపై నెట్టేస్తే ఎలా..?

సమగ్ర శిక్షా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నడిచే పథకం అయినా.. ప్రధాన యజమాని రాష్ట్ర ప్రభుత్వమే. బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అవసరాల మేరకు విడుదల చేస్తుంది. అయితే ఉద్యోగుల వేతనాలు పెంపు, సర్వీసు నిబంధనలు, క్రమబద్ధీకరణ, ఉద్యోగుల సంక్షేమ సౌకర్యాలు వంటి అంశాలు పూర్తిగా రాష్ట ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రాష్ట్రాలకు చెప్పింది. ఇదే పథకం కేంద్ర వాటా 60 శాతం విధులతో పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, సిక్కిం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంపై నెట్టెస్తూ చేతులు దులుపేసుకుంటుంది.

సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది పోరుబాట

డిమాండ్ల సాధనకు ఈ నెల 15న మంత్రి లోకేష్‌ ఇంటికి పాదయాత్ర

ఎన్నికల ముందు చెప్పిందేమిటీ ? ఇప్పుడు చేస్తుందేమిటీ

మెరుగైన జీతాలంటూ మంత్రి లోకేష్‌ మాటలపై మండిపాటు

జిల్లాలో 464 మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఇబ్బందులు

న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం ఈ నెల 15న చేపట్టిన శాంతియుత పాదయాత్రను అందరూ జయప్రదం చేయాలి. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. గతంలో ఆర్టీ యాక్టుతో సెంట్రల్‌ హెచ్‌ఆర్‌ఎంటీని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జీతభత్యాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికై నా న్యాయం చేయాలి.

– కె.వినోద్‌కుమార్‌,

ఏలూరు జిల్లా, జేఏసీ అధ్యక్షుడు

పెరిగిన నిత్యవసర ధరలకు సరిపడా వేతనాలు మాకు లేవు. ముందు కనీస వేతనాలు అమలు చేయాలి. సమగ్ర శిక్షా సిబ్బంది జీతాలు ఏడు సంవత్సరాలుగా అలానే కొనసాగుతున్నాయి. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. పాదయాత్రకు కుటుంబ సమేతంగా పాల్గొనాలి.

– బి.రాజ్యలక్ష్మి,ఏలూరు జిల్లా మహిళా జేఏసీ, జనరల్‌ సెక్రటరీ

Advertisement
 
Advertisement
Advertisement