ఎన్నడూ లేనివిధంగా..
సాక్షి, భీమవరం/ పెనుగొండ: కూటమి నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్నారని తాజాగా ఆచంట మండలం కొడమంచిలికి చెందిన దళిత మాజీ సర్పంచ్‌ను అక్రమంగా అరెస్టు చేయించారు. మునుపెన్నడూలేని విధంగా ఉపాధి పనుల్లో అవకతవకల పేరిట మాజీ సర్పంచ్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆచంట, పెనుగొండ, యలమంచిలి మండలాలు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలోకి వెళ్లడంతో రెండేళ్లుగా ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. సిద్ధాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి ఓపెన్ ర్యాంపులు మూతపడ్డాయి. ఇదే అదునుగా కూటమి నేతలు ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపారు. లంక భూములు, నక్కల డ్రెయిన్‌లో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల సహజ సంపదను కొల్లగొడుతుంటే ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడితో అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారన్న విమర్శలున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత, కొడమంచిలి మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ పార్టీ శ్రేణులతో కలిసి అక్రమ తవ్వకాలకు అడ్డుతగులుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌జెడ్ పరిధిలో తవ్వకాలకు వ్యతిరేకంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కూటమి స్థానిక నాయకత్వం పంచాయతీ రికార్డుల్లో అవకతవకలు జరిగాయంటూ విచారణల పేరిట ఏడాదికాలంగా సీతారామ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారు. సీతారామ్ వెనక్కి తగ్గకపోవడంతో రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చారు.
గ్రామస్థాయిలో చేపట్టిన ఉపాధి పనులపై ఏటా గ్రామ, మండల స్థాయిలో గ్రామ సభల రూపంలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో పనులు సక్రమంగా జరిగిందీ లేనిది పరిశీలించి నిధులు దుర్వినియోగం జరిగి ఉంటే మేట్, ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, ఏపీఓ తదితర ఉద్యోగుల్లో బాధ్యులు ఎవరో గుర్తించి వారి నుంచి సొమ్ములు రికవరీ చేయడం, శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఉపాధి పనులు మొదలై దాదాపు 18 ఏళ్లు కావస్తుండగా జిల్లాలోని 20 మండలాల పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేశారు. ఇప్పటివరకు 18 రౌండ్లు (ఆర్థిక సంవత్సరానికి ఒక్కసారి) జరిగిన సోషల్ ఆడిట్‌లో రూ.2.45 కోట్లు నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించి బాధ్యుల నుంచి రూ. 2.04 కోట్లు రికవరీ చేశారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో జరిగిన సోషల్ ఆడిట్‌లో రూ.16.03 లక్షలు మేర వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. గ్రామం నుంచి మండల స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు 217 మంది బాధ్యులుగా తేల్చారు. కాగా ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల్ని బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు. కాగా అక్రమ తవ్వకాలకు అడ్డుతగులుతున్నారనే కూటమి నేతలు సీతారామ్‌పై అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేయించారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అధికారులు, పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. బుధవారం అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆచంట పోలీస్ స్టేషన్ చేరుకుని నిరసన తెలిపారు.
వైఎస్సార్‌సీపీ దళిత మాజీ సర్పంచ్‌పై అక్రమ కేసు
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ అరెస్టు
మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నారనే కక్ష సాధింపులు
ఆచంట చేరిన రెడ్‌బుక్ రాజ్యాంగం
మాజీ సర్పంచ్ అక్రమ అరెస్టుపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం


