భీమవరం అర్బన్ : పశ్చిమగోదావరి జిల్లా రెడ్‌క్రాస్ శాఖ 2025–26లో నిర్వహించిన సేవా కార్యక్రమాలు, నిధుల సమీకరణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా అవార్డు లభించింది. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్‌వీఎస్ భద్రిరాజు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు జిల్లా బృందం సమష్టి కృషికి ప్రతిఫలం అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షురాలు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
భీమవరం: పట్టణంలోని ఏఎస్‌ఆర్ నగర్‌లో ఉన్న అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద గురువారం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి 102వ వర్థంతి సందర్భం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.25 లక్షలతో వ్యయంతో నిర్మించిన డిజిటల్ స్క్రీన్, వాటర్ ప్లాంట్, వాటర్ మౌంటెన్స్‌ను ప్రారంభించారు. పాఠశాలల విద్యార్థులు అల్లూరి వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఉద్దరాజు విశ్వనాథరాజు, కార్యదర్శి కంతేటి వెంకటరాజు, కోశాధికారి సీహెచ్ కృష్ణంరాజు, వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు సుబ్బరాజు, ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, తహసీల్దార్ రావి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి గూడూరి ఉమాబాల పాల్గొన్నారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యదర్శిగా ఎన్.శ్రీలక్ష్మి గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేసిన ఆమెను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా నియమించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన కె.రత్నప్రసాద్ మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా రాజమహేంద్రవరం బదిలీపై వెళ్లారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నిర్వహించిన 7వ కలెక్టర్ల కాన్ఫెరెన్స్ తొలి రోజు సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాజెక్టులకు స్థలాల అవసరతపై చర్చ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆచంటలో ఐటీఐ సమర్థవంతంగా కొనసాగుతున్నప్పటికీ, స్థలం లేక సొంత భవనాల నిర్మాణం చేపట్టలేకపోతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఐటీఐ భవన నిర్మాణానికి కనీసం రెండు ఎకరాల స్థలం అవసరమని విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే భూసేకరణ ద్వారా స్థలం సమకూర్చే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.


