పాలకోడేరు: నిబంధనలకు విరుద్ధంగా మండలంలో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ రవాణా సాగుతోంది. మోగల్లు, పాలకోడేరు, వేండ్ర, శృంగవృక్షం, గొల్లలకోడేరు, గరగపర్రు, విస్సాకోడేరు, పెన్నాడ, కోరుకొల్లు తదితర గ్రామాల్లో మట్టి లారీలు, ట్రాక్టర్లు వేగంగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికితోడు రోడ్లపై మట్టి ముద్దలు పడడంతో రోడ్లు సైతం ధ్వంసం అవుతున్నాయి. రోడ్లపై పడిన మట్టి గడ్డల వల్ల వర్షం వస్తే చిత్తడిగా మారి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తహసీల్దార్ పీవీఎన్‌ఎస్‌ఎస్ లక్ష్మిని వివరణ కోరగా ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు.


