ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరులో జాప్యాన్ని తక్షణం నివారించాలని జిల్లా సర్వజన ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ అచ్యుత రామయ్యను పీఆర్‌టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఆసుపత్రిలో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి పెట్టుకున్న వైద్య ఖర్చుల బిల్లులు సకాలంలో అందక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరికి సంబంధించి ఏడాది కాలం గడిచినా మంజూరుకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫైళ్లన్నీ తక్షణం పర్యవేక్షించి వెంటనే మంజూరు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. సూపరింటెండెంట్‌ను కలిసిన వారిలో పీఆర్‌టీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ఎల్‌వీ చలం ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ‘వన్ మంత్, వన్ విలేజ్, 4 విజిట్స్’ కార్యక్రమాన్ని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ కోరారు. గురువారం ఆయన అధ్యక్షతన స్థానిక శనివారపుపేట–1 స్వర్ణవార్డు సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.


