జలాశయాలు వెలవెల | - | Sakshi
Sakshi News home page

జలాశయాలు వెలవెల

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

అడుగంటిన తమ్మిలేరు

చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేయాలి

చింతలపూడి: మెట్ట ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల నీటి మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది తొలకరిలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. అయితే ఆ తర్వాత సరైన వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలమట్టం నానాటికి పడిపోతుంది. మే నెల ఎండలు వివపరీతంగా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. భూగర్భ జలాలపై ఆధారపడిన మెట్ట ప్రాంతంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చెరువులు ఎండిపోవడంతో పశువులు కూడా తాగునీటికి తీవ్ర ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టుల్లో నీరు ఉంటే భూగర్భ జలాలు ఇంత దారుణంగా కిందికి పడిపోయే ప్రమాదం ఏర్పడేది కాదని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని జూన్‌లో తొలకరి వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు చేరితే పరిస్థితి చక్కబడుతుందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు ఉండగా చిన్న నీటి పారుదల కింద జల్లేరు జలాశయంతో పాటు 1,398 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు క్రింద సుమారు 43,500 ఎకరాలు సాగవుతుంది.

ఎర్రకాలువ

సుమారు 19 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం 83.5 మీటర్లు కాగ డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకోవాలంటే 76 మీటర్లకు చేరుకోవాలి. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 79 మీటర్లకు చేరుకుంది. ప్రతిఏటా వర్షాకాలంలో వృధాగా థాపోతున్న వేల క్యూసెక్కుల ఎర్రకాలువ వరద నీటిని సాగునీటికి వినియోగించుకోవాన్న ఉద్దేశంతో పోలవరం నియోజకవర్గంలోని టి.నరసాపురం సమీపంలో నందమూరి విజయసాగర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. అప్పటి నుంచి ప్రాజెక్టు కింద అధికారికంగా సుమారు 1,000 ఎకరాలు, అనధికారికంగా మరో 1,000 ఎకరాలు సాగవుతుంది. ఎర్రకాలువ వట్టిపోతే నందమూరి విజయసాగర్‌ ప్రాజెక్టు కూడా నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది.

చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో 3 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో 9,169 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నీరు ఉంటే చుట్టు పక్కల మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 355 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 327 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో పలు గ్రామాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గుముఖం పడుతుంది. దీంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే మెట్టకు సాగునీటి కష్టాలు తప్పుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

మెట్ట ప్రాంతంలో సాగు, తాగు నీటికష్టాలు తొలగిపోవాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం ఒక్కటే మార్గం. గోదావరి జలాలను మళ్లిస్తే మెట్ట ప్రాంతంలోని ప్రాజెక్టులు, చెరువులు నింపుకోవచ్చు. వేసవి కాలంలో కూగా తాగు,సాగు నీటికి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.

– కంభం విజయరాజు, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, చింతలపూడి

ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గుదల

327 అడుగులకు తమ్మిలేరు జలాశయం

79 మీటర్లకు ఎర్రకాలువ ప్రాజెక్టు

మూడొంతులు ఎండిపోయిన చెరువులు

Advertisement
 
Advertisement
Advertisement