● వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో అలసిపోతున్న బాలలు
● పౌష్టికాహారం కోసం ఎదురుచూపులు
ఏలూరు రూరల్ : ఆటలు అంటే మాకు చాలా ఇష్టం. ఎంతసేపైనా ఆడాలనిపిస్తోంది. కానీ ఆడి ఆడి అలిసిపోతున్నాం. శక్తి చాలడం లేదు. రోజూ గుడ్డు, పాలు తాగాలని కోచ్ చెబుతున్నాడు. ఇంట్లో గుడ్డు పాలు అడిగితే, ఆటలకు వెళ్లొద్దు అంటారు. అందుకే కడుపునిండా నీళ్లు తాగి, మళ్లీ, మళ్లీ ఆడుతున్నాం. ఇది ఏలూరు ఇండోర్ స్టేడియంలోని వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో హ్యాండ్‌బాల్ సాధన చేస్తున్న బాల బాలికల ఆవేదన. ఇక్కడే కాదు అల్లూరి సీతారామరాజు స్టేడియంతో పాటు జిల్లాలో 50కు పైగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని శిక్షణ శిబిరాల్లో క్రీడల సాధన చేస్తున్న బాలల దుథితి ఇలాగే ఉంది. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లావ్యాప్తంగా 50కు పైగా శిబిరాల్లో సుమారు 1500 మంది పిల్లలకు శిక్షణ అందిస్తోంది. ఇందులో అత్యధికులు పేద, బడుగు వర్గాలకు చెందిన పిల్లలే ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వస్తున్న ఈ పిల్లల సాధనకు సరిపడా ఆహారం అందడం లేదు. ఫలితంగా పిల్లలు ప్రతిరోజూ సాధన చేసి శారీరకంగా అలసిపోతున్నారు. మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. క్రీడాధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర సాయం కూడా క్షేత్రస్థాయిలో పిల్లలకు అందించలేకపోతున్నారు. కొన్ని శిబిరాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడం లేదు. సాయం చేసే దాతల ఉన్నా, పిల్లల కోసం సాయం కోరే నాథుడే లేడు. మరోవైపు శిక్షణ శిబిరాల నిర్వహణ ఆటంకాల లేకుండా సాగుతున్నాయని, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని అధికారులు చెబుతున్నారు.
డీఎస్‌డీఓ అజీజ్ ఏలూరులో సమ్మర్ క్యాంప్‌కు వస్తున్న పిల్లల కోసం చిక్కీలు ఇచ్చారు. సాధన చేస్తున్న పిల్లలకు ప్రతి రోజూ పంపిణీ చేయమన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు తొందరగా అలసిపోతున్నారు. కడుపు నిండా ఆహారం అందిస్తే, పిల్లలు మరింత ఉత్సాహంగా సాధన చేస్తారు.
– ఆలీష, వ్యాయామ ఉపాధ్యాయుడు
వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న బాలబాలికలకు ప్రభుత్వం రోజుకు రూ.6 మంజూరు చేసింది. త్వరలోనే శిక్షణ శిబిరాల నిర్వాహకుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేస్తాం. ఇండోర్‌స్టేడియంలో దాతల సహకారంతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి పిల్లలకు తాగునీరు అందిస్తాం.
–ఎస్‌ఏ అజీజ్, డీఎస్‌డీఓ
ఏలూరు ఇండోర్‌స్టేడియంలో తాగునీరే దొరకడం లేదు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్ పాడైపోయింది. అప్పటి నుంచి స్టేడియంలో వాటర్ ప్లాంట్ బాగు చేయలేదు. ఇక్కడ పిల్లలు ఆడి ఆడి అలసిపోవడం తప్ప, నీళ్లు ఇచ్చే నాథుడే లేడు. అధికారులు స్పందించి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– అతీక్, సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు
ఇండోర్‌స్టేడియంలో సాధన చేస్తున్న క్రీడాకారులు, స్థానిక అన్న క్యాంటిన్ వద్ద ప్రతి రోజూ ఉదయం పడిగాపులు పడడం చూస్తున్నాను.. రూ.5తో టిఫిన్ కొని, ఆకలి తీర్చుకుంటున్నారు. కొన్నిసార్లు టిఫిన్ అయిపోవడంతో విచారంగా వెనుదిరుగుతున్నారు. వీళ్లను చూసి నాకు చాలా బాధ వేసింది.
–ఎస్.సత్యనారాయణ, అడ్వకేట్


