● ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించిన భార్య
● ఐదుగురు నిందితుల అరెస్ట్
ఏలూరు టౌన్: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్ సాయంతో ఓ భార్య హత్య చేయించింది. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను ఆగిరిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు.ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులోమన్‌రాజు అతని భార్య రెడ్డి దుర్గామణితో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని సచివాలయంలో పని చేస్తున్న పలగాని వెంకన్నబాబుతో దుర్గామణి వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సులోమన్‌రాజు భార్యను తరచూ కొడుతూ ఉండేవాడు. దీంతో దుర్గామణి తన బాధను పరిచయం ఉన్న వ్యక్తితో చెప్పుకుంది. తనకు చనిపోవాలని ఉందని చెప్పగా... నువ్వు చనిపోవడం కంటే నీ భర్తను తొలగిస్తే సమస్య ఉండదు కదా అంటూ సలహా ఇచ్చాడు. వెంటనే దుర్గామణి తన భర్తను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుని ప్రియుడు వెంకన్నబాబుకు తెలిపింది. ఇదే అదనుగా వెంకన్నబాబు తన బంధువు ద్వారా కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బంగారుగూడెం గ్రామానికి చెందిన కలతోటి సాయి శ్రీనివాస్, ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, భీమరాజుగుట్ట ప్రాంతానికి చెందిన మద్దాలి జస్వంత్‌రాయ్, బంగారుగూడెం గ్రామానికి చెందిన కలతోటి మణికంఠతో మాట్లాడి రూ.12 లక్షలు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు.
కారులో లిఫ్ట్ ఇచ్చి..
చార్జర్ వైర్‌తో గొంతు బిగించి..
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న నిందితులు సులోమన్‌రాజుకు తమ కారులో లిఫ్ట్ ఇచ్చారు. అనంతరం అందరూ కలిసి మద్యం సేవించారు. గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో జగనన్న ఇళ్ల సముదాయం వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్ గేటు సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి చార్జర్ వైరుతో గొంతు బిగించి సులోమన్‌రాజును హత్య చేసి, ఏలూరు కాలువలో పడేశారు. ఈ సంఘటనపై ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్సై కె..శుభశేఖర్, చాట్రాయి ఎస్సై డి.రామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం నిందితులను గుర్తించి గురువారం గన్నవరం ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అలాగే సులోమన్‌రాజు భార్య దుర్గామణి, ప్రియుడు వెంకన్నబాబను కూడా అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి బాలెనో కారు, ఐదు సెల్‌ఫోన్లు, ఖాళీ బీరు సీసాలు ఐదు, సెల్‌ఫోన్ పవర్‌బ్యాంక్ చార్జింగ్ కేబుల్, రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించటంలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


