ద్వారకాతిరుమల : మండలంలోని గుణ్ణంపల్లి పరిధిలో నిత్యం మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆ గ్రామ పరిధిలోని ఓ పచ్చ నాయకుడు సాగిస్తున్న ఈ దందా నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు పోలవరం, తాడిపూడి కాలువ గట్లను కొల్లగొట్టిన ఆ నాయకుడు ఇప్పుడు ఖాళీ స్థలాల మీద పడ్డాడు. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి, పగలు మట్టిని దోచేస్తున్నాడు. బహిరంగంగా జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ తెలియనట్టు చోద్యం చూస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మీ పని మీరు చేసుకోండని సమాధానం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార బలం ఉన్న నాయకుడితో మనకెందుకులే అని స్థానికులు సైతం గప్‌చుప్ అయిపోయారు. దాంతో సదరు పచ్చనాయకుడి అక్రమాలకు అద్దూఅదుపు లేకుండా పోతుంది.
టిప్పర్ల ద్వారా తరలింపు
ప్రస్తుతం ఆర్‌ఎస్ నెంబర్ 234లో ఈ మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. జేసీబీతో తవ్వకాలు జరిపి, టిప్పర్ల ద్వారా మట్టిని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి రూ.10 వేల నుంచి రూ. 15 వేలకు అమ్మి, ఆ నాయకుడు సొమ్ము చేసుకుంటున్నాడు. ఇప్పటికై నా అధికారులు మేల్కొని ఈ అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గుణ్ణంపల్లి పరిధిలో రెచ్చిపోతున్న పచ్చనేత


