ప్రత్యేక దృష్టి సారించాలి
రైతు ప్రయోజనాలు కాపాడాలి
చెరువులను పరిరక్షించాలి
చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో ప్రమాదం అంచున మూడు మండలాలు
దెందులూరు : పూర్తిగా వ్యవసాయధారిత ప్రాంతమైన ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు క్షీణిస్తుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ నిధులు, సిబ్బంది ఉన్నా.. పటిష్టమైన ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఈ దుస్థితికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని 194 గ్రామాల్లో 20 మీటర్ల లోతులో.. 200 గ్రామాల్లో 20 మీటర్ల పైబడి భూగర్భ జలాలు ఉండగా కొయ్యలగూడెం ద్వారకాతిరుమల, ముసునూరు వంటి మండలాల్లో మాత్రం ప్రమాదకర స్థితిలో 80 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. దీంతో భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వాల్టా చట్టం.. అపహాస్యం
భూగర్భ జలాలు దుర్వినియోగం కాకుండా ఏర్పాటు చేసిన వాల్టా చట్టం అపహాస్యానికి గురవుతోంది. మండలాల్లో తహసీల్దార్ చైర్మన్‌గా విద్యుత్, ఇరిగేషన్, వ్యవసాయం, మైన్స్ శాఖల అధికారులతో పాటు గ్రామస్థాయి ఉద్యోగుల పరిశీలన సిఫార్సుతో నూతన బోరు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో వాల్టా చట్టాలకు అనుగుణంగా ఏ ప్రాంతంలోనూ బోర్ల నిర్మాణం జరగటం లేదు. నిబంధనలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. పొలాల్లో బోర్లు పక్కన బోర్లు నిర్మాణం జరగటం, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణంగా భూగర్భ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఆక్రమణల చెరలో చెరువులు
జిల్లాలో 1513 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 69 వేలకు పైగా బోర్లు, 3 లక్షల కుళాయిలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 నుంచి 35 శాతం చెరువులు ఆక్రమణ చెరలో మగ్గుతున్నాయి. దీనికి ఎన్నో ఒత్తిడులు, కోర్టు వివాదాల నిర్లక్ష్యం కారణమని చెబుతున్నారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ ప్రశ్నార్థకమే. రెవెన్యూ పంచాయతీ పోలీస్ శాఖల అధికారులు పటిష్టంగా సమన్వయంతో విధులు నిర్వహించి మైనర్ ఇరిగేషన్ చెరువుల ఆక్రమణ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
భూగర్భ జలాలు అడుగంటి ప్రమాదం అంచున ఉన్న మూడు మండలాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించాలి. పైలెట్ ప్రాజెక్టుగా పనులు చేపట్టాలి. నీటి సామర్థ్యం నిల్వలు సాధారణ స్థితికి తీసుకురావాలి.
– డాక్టర్ ప్రతాప్, జెడ్పీటీసీ, ముసునూరు
సాగునీటి సరఫరాకు అడ్డంకిగా తరాల నుంచి ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. రైతు ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన్య ధ్యేయంగా శాశ్వత విధానం రూపొందించాలి.
– రమేష్, జడ్పీటీసీ, కామవరపుకోట
జిల్లాలోని మైనర్, ఇరిగేషన్ చెరువులన్నిటిని వినియోగంలోకి తీసుకురావాలి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అధికారులు చిత్తశుద్ధితో సేవలు అందించాలి. రైతులకు సాగునీటి భరోసా భద్రత కల్పించాలి.
– కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే, దెందులూరు
కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల, ముసునూరు మండలాల్లో భూగర్భ జలాలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. జిల్లాలో నీటి నిల్వలు పెంచేందుకు జలధర.. జల హారతి కార్యక్రమాలు చేపట్టాం. నీటిని రీఛార్జ్ చేసేందుకు చెరువుల తవ్వకానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
– కోదండరావు, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ గనుల శాఖ, ఏలూరు


