సైనిక సేవల్లో తొలిమెట్టు | - | Sakshi
Sakshi News home page

సైనిక సేవల్లో తొలిమెట్టు

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

సైనిక సేవల్లో తొలిమెట్టు

ఉద్యోగావకాశాలు మెండు

ఉత్తమ పౌరులను అందించడంలో ఎన్‌సీసీ కీలకపాత్ర

ఏలూరులో 650 మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : దేశభక్తికి ప్రేరణగా నిలుస్తూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో ఆర్మీలో రెండవ సైనిక శిక్షణ సంస్థగా గుర్తింపు పొందిన నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌లతో కూడిన ట్రై సర్వీసెస్‌ ఆర్గనైజర్‌ స్వచ్ఛందంగా పాఠశాల, కళాశాల శిక్షణ కోసం ఎన్‌సీసీని ఏర్పాటు చేశారు. విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ధ్రుడమైన పౌరులుగా మార్చి త్రివిధ దళాల్లో చేరేలా ప్రోత్సహిస్తూ శిక్షణనిస్తోంది. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సహాయ, సహకారాలు అందించడానికి నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ సభ్యులు ముందుంటారు. మొత్తం 15 లక్షల మంది ఎన్‌సీసీ క్యాడెట్లుగా శిక్షణ పొందుతున్నారు. దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో, మోడల్‌ స్కూళ్లలో ఎన్‌సీసీ శిక్షణ తప్పక నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

650 మందికి శిక్షణ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన ఏలూరులో గత నెల 28వ తేదీన ఎన్‌సీసీ ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీ వరకూ ఈ శిబిరం కొనసాగుతోంది. ఈ శిక్షణలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 650 మంది విద్యార్థులు ఎన్‌సీసీ క్యాడెట్లుగా శిక్షణ పొందుతున్నారు. సైనిక సేవల్లో ఎన్‌సీసీ శిక్షణను తొలిమెట్టుగా గుర్తిస్తారు. ఇక్కడ ఇచ్చే శిక్షణతో యువతలో క్రమశిక్షణాయుత జీవితం అలవడుతుంది.

ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ద్వారా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ఉంటుంది. ట్రిపుల్‌ ఐటీ, ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌, డైట్‌, బీఈడీ వంటి వివిధ కోర్సుల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్‌ ఉంటుంది. ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో హోంగార్డు సెలెక్షన్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లలో వీరికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎన్‌సీసీ శిక్షణ పొంది అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో, త్రివిధ దళాల్లో ఉద్యోగాలు సాధించినవారు ఎందరో ఉన్నారు. కొందరు క్లిష్టమైన పర్వతాలు అధిరోహించి, అంతర్జాతీయ పర్వతారోహకులుగా ఖ్యాతి గడించారు.

Advertisement
 
Advertisement
Advertisement