భీమవరం (ప్రకాశంచౌక్): నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌లో 6 వేల మీటర్ల పర్వతారోహణ చేసి భీమవరం విచ్చేసిన గొట్టుముక్కల వాణికి బుధవారం శ్రీ విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. పర్వతారోహణ చేయటం చాలా సాహసకృత్యమని, ఈ విధమైన కార్యక్రమం చేయడం మహిళాలోకానికే గర్వకారణమని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ చెరుకువాడ రంగసాయి, కటికిరెడ్డి వెంకటరత్నం, నందమూరి రాజేష్ అన్నారు. గొట్టుముక్కల వాణి 64 ఏళ్ల వయస్సులో ఈ సాహస యాత్ర చేయటం గొప్పవిశేషమన్నారు. వాణి 15 రోజులపాటు మైనస్ డిగ్రీ వాతావణంలో నేపాల్ దేశంలో ఎవరెస్టు బేస్ క్యాంప్ ప్రారంభించి పర్వతాన్ని అధిరోహించి నేడు స్వదేశానికి రావటం గొప్పవిశేషమన్నారు.
కామవరపుకోట: సాంకేతిక లోపంతో కారు ఇంజన్‌లో నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక బంగ్లా నుంచి చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న కారు కొత్తూరు బస్టాండ్ వద్ద ఆగిపోయి ఇంజన్‌లో నుంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై స్థానికుల సహాయంతో మంటలు అదుపు చేశాడు. కారులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెల్లరేగినట్లు డ్రైవర్ తెలిపాడు.
తాడేపల్లిగూడెం: స్థిరమైన వ్యవసాయానికి మూల స్తంభం సమతుల్య ఎరువుల వినియోగమేనని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్.కిరణ్‌కుమార్ తెలిపారు. బుధవారం వెంకట్రామన్నగూడెం కేవీకేలో సమతుల్య ఎరువుల వినియోగంపై నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు జరిపించాలన్నారు. ఖరీఫ్‌లో దిగుబడులు సాధించడానికి శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ రేఖ మాట్లాడుతూ కూరగాయలు, పండ్లు, మసాలా పంటల్లో ఎరువుల వినియోగం ఎలా ఉండాలో వివరించారు. వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ కె.అర్చన పచ్చిరొట్ట ప్రాముఖ్యత, నేల సారాన్ని మెరుగుపర్చడానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. జీవ ఇన్‌పుట్ల ప్రాముఖ్యత, వాటి వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనం గురించి మత్స్య పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ.దేవీవరప్రసాదరెడ్డి వివరించారు. పలు విషయాల గురించి శిక్షకులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు.
వీరవాసరం: కారు ఢీకొన్న ఘటనలో సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం.. వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన గంధం సత్యనారాయణ (70) సైకిల్‌పై పొలం పనుల నిమిత్తం వెళుతుండగా స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సత్యనారాయణను పెనుమంట్రకు చెందిన 108లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


