గణపవరం: వేసవి సెలవుల్లో తోటి స్నేహితులతో సరదాగా ఆటలు ఆడుకుంటూ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ బాలుడికి గురువులు అండగా నిలబడి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన దువ్వారపు అభిషేక్ అనే బాలుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులలో అమ్మమ్మగారి ఊరైన కృష్ణా జిల్లా కానుకొల్లు గ్రామం వెళ్లాడు. అక్కడ స్నేహితులతో ఆడుకుంటూ గోడమీదకి ఎక్కి ప్రమాదవశాత్తూ కాలుజారి పక్కన నిర్మాణంలో ఉన్న ఇంటి పునాదులపై పడిపోగా, పిల్లర్లకోసం వేసిన ఇనుప ఊచ మెడభాగంలో దవడలో దిగబడి బయటకు వచ్చింది. ఊచనుకోసి వెంటనే విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి బాలుడ్ని తరలించారు. అక్కవ రూ.3 లక్షల ఖర్చుతో వైద్యులు ఆపరేషన్ చేసి ఇనుప ఊచను తొలగించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.
ఉపాధ్యాయుల ఆర్థిక సహాయం
విషయం తెలిసిన బాలుడు చదువుతున్న చిలకంపాడు హైస్కూలు ఉపాధ్యాయిని దుర్గాభవాని, తోటి ఉపాధ్యాయులు హెల్పింగ్ హేండ్స్ అనే ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి విరాళాలు సేకరించారు. రూ.1,20,000 అభిషేక్ తల్లిదండ్రులకు అందించి అండగా నిలిచారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం బి.సుధారాణి, ఉపాధ్యాయులు చల్లా కృష్ణ, గండ్రోతుల నాగేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు పమ్మి బుచ్చిమాస్టారు, బి.రమేష్, ఎం.పెద్దిరాజు, బీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


