తణుకు అర్బన్: యమునా నది పుష్కరాలకు తణుకు ఆర్టీసీ బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజరు ఆలపాటి ధనలక్ష్మి సుధారాణి బుధవారం విలేకరులకు తెలిపారు. వచ్చేనెల 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు తణుకు బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరుతాయన్నారు. 11 రోజుల యాత్రలో 13 పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంటుందన్నారు. యాత్రలో యాదగిరిగుట్ట, ఆగ్రా, మధురలో పుష్కర స్నానం, బృందావనం, అయోధ్య, కాశి, ప్రయాగరాజ్, గయా, బుద్ధగయ, జాబపూర్, పూరి, కోణార్క్, భువనేశ్వర్ క్షేత్రాలను దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు. బస్సుల రిజర్వేషన్ కోసం 94404 19144, ఇతర వివరాలకు 99592 25484, 73829 03287, 98491 69396 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అనంతరం యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. అలాగే వేసవి సెలవుల నేపథ్యంలో విశాఖ విహార యాత్ర, మారేడుమిల్లి స్పెషల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.
ఉండి: ఎన్నార్పీ అగ్రహారంలో ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఐటీఐ విద్యార్థులకు అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ ఎం.వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25లో ఐటీఐ పూర్తి చేసి అప్రెంటీస్ పూర్తిచేయని విద్యార్థులకు ఇది సదావకాశమని తెలిపారు. వివరాలకు 96183 82542, 96406 30969 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


