న్యూస్‌రీల్
అప్రమత్తంగా ఉండాలి
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
సాక్షి, భీమవరం: సైబర్ మోసాలు ఒక ఎత్తయితే, వాటిలో చిక్కుకున్న బ్యాంకు అకౌంట్లతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లావాదేవీలు జరిపిన వారి ఖాతాలకు కష్టకాలం ఏర్పడింది. శాలరీ అకౌంట్లు, సేవింగ్ ఖాతాలు, బిజినెస్ కరెంటు అకౌంట్లు స్తంభిస్తే వారి జీవనం స్తంభించినట్లే. అవి తిరిగి పొందాలన్నా, అనన్‌ఫ్రీజ్ చేయించుకోవాలన్నా సవాలక్ష ఆంక్షలు ఉండడంతో నిట్టూరుస్తున్నారు.
ప్రధానంగా ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ యాప్‌ల్లో ఎవరికీ తెలియకుండా తమ ఖాతాలో సొమ్ములు జమైపోతున్నాయనుకుంటే పొరబాటేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉపయోగించడం ద్వారా బెట్టింగ్ రాయుళ్లు ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలు చిక్కినప్పుడు వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా బుకీతో లావాదేవీలు జరిపిన ఖాతాలను స్తంభింపచేస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల ఖాతాల గురించి తెలీక రెండు మూడు సందర్భాల్లో లావాదేవీలు జరిపిన వారి అకౌంట్లు ఫ్‌రీజవుతున్న పరిస్థితి. ఇదిలాఉంటే ఆనన్‌లైన్‌న ట్రేడింగ్ పేరుతో బురిడి కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ క్రమంలో మోసపోయిన వ్యక్తి కేసు పెడితే ట్రేడింగ్ జరిపిన అమాయకుల ఖాతాలు సైతం మాస్ ఫ్రీజ్ అవుతున్నాయి.
ఏటీఎంల వద్ద బహుపరాక్
నగదు విత్‌డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లిన సందర్భంలో అపరిచిత వ్యక్తులు నగదు ఇచ్చి తమకు కావాల్సిన అకౌంట్‌కు ఫోన్‌పే చేయమని కోరడం చూస్తుంటాం. వెయిటింగ్ లేకుండా వెంటనే నగదు చేతికొస్తుందన్న ఉద్దేశ్యంతో కొందరు ఆ నగదు తీసుకుని ఆ మొత్తానికి వారు చెప్పిన అకౌంట్‌కు ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తుంటారు. ఈ లావాదేవీలు ఏమాత్రం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవతలి వ్యక్తి ఆ నగదు ఎలా పొందాడు? ఎవరి అకౌంట్‌కు పంపుతున్నాడనేది చేసే వారికి తెలీదు. సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్‌లతో సంబంధం ఉన్న అకౌంట్లు అయితే పేమెంట్ చేసిన వారి ఖాతా కథ ముగిసినట్టేనంటున్నారు.
సైబర్ మోసాల్లో నగదుపోయిన వారి కంటే ఖాతాలు స్తంభించిన వారి బాధలు వర్ణనాతీతం. మాస్ ఫ్రీజ్ ఏఐ అల్గారిథమ్ ద్వారా జరుగుతుందని, తామేమి చేయలేమని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కేసు మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉండడం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)లకు తిరగలేక కొందరు అకౌంట్లలోని సొమ్మును వదిలేసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సెల్‌ఫోన్ ట్రాకింగ్ వంటి విధానంలో ఇతర రాష్ట్రాల్లోని ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
భీమవరానికి చెందిన యువకుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ట్రేడింగ్‌లో ఆసక్తి ఉండటంతో ఆన్‌లైన్ యాప్‌లోని గ్రూప్‌లో చేరి ట్రేడింగ్ ప్రారంభించాడు. ఇంట్లో అవసరం వచ్చి బంగారం కుదవపెట్టి రూ.20 వేల నగదు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయించుకున్నాడు. తర్వాతి రోజు నగదు కోసం బ్యాంక్‌కు వెళితే అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని సిబ్బంది చెప్పడంతో ఖంగు తిన్నాడు. ఆరా తీస్తే ఒక ఫ్రాడ్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి రూ.1200 నగదు అకౌంట్‌లో జమయ్యిందని తెలిపారు. రాజస్థాన్‌లో కేసు నమోదు అయ్యిందని అక్కడి పోలీస్ స్టేషనన్ నుంచి ఎన్‌ఓసీ తీసుకువస్తే అకౌంట్ అనన్ ఫ్రీజ్ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. చేసేదేమి లేక రూ.20 వేల నగదు వదులుకున్నాడు.
తణుకుకు చెందిన ఒక మొబైల్ షాప్ యాజమాని తన కరెంటు అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని బ్యాంకులో ఆరా తీస్తే సైబర్ క్రైమ్‌లో నమోదు అయిన వ్యక్తి షాపులో ఫోన్ కొనుగోలు చేసి డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించాడని తెలిపారు. వ్యక్తి ఎలాంటి సొమ్ము చెల్లిస్తున్నాడో మాకు ఎలా తెలుస్తుందని యజమాని ప్రశ్నించినా ఫలితం లేక పోవడంతో హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ సెల్‌లో తెలిసిన వ్యక్తి ద్వారా సంప్రదిస్తే అకౌంట్ అన్ ఫ్రీజ్ చేయడానికి ఖర్చవుతుందని చెప్పారు. బిజినెస్ అకౌంట్ కావడంతో చేసేదిలేది లేక అడిగినంత ఇచ్చి అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయించుకున్నారు.
బ్యాంకు అకౌంట్ల లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఖాతాలకు నగదు పంపడం, తీసుకోవడం చేయకూడదు. అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తే ఖాతా లావాదేవీలు పరిశీలించి, విచారణ చేసి ఎన్‌ఓసి ఇప్పించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదు అయిన సందర్భాల్లో ఆయా రాష్ట్రాల పోలీస్ సిబ్బందిని సంప్రదించి అన్‌ఫ్రీజ్ చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నాం.
ఎం.నాగరాజు, సీఐ, భీమవరం వన్‌టౌన్
అనుమానాస్పద లావాదేవీలంటూ సమాధానం
తెలియకుండానే బెట్టింగ్, ఆన్‌లైన్‌ట్రేడింగ్ కేసుల్లో ఇరుక్కుంటున్న వైనం
కేసు మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో వెతలు


