విదార్థుల సంఖ్య తగ్గుతోంది
ఉచిత విద్యకు తక్కువ సొమ్ము
● ప్రైవేటు స్కూళ్లలో 1,047 సీట్లు కేటాయింపు
● తల్లికి వందనం కంటే తక్కువ మొత్తం చెల్లింపుతో నిరాసక్తత
భీమవరం: పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు ఆదరణ తగ్గుతోంది. తల్లికి వందనం పథకంలో ఇచ్చే సొమ్ము కంటే ప్రైవేట్ స్కూల్స్‌కు చెల్లించే మొత్తం తక్కువగా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉచిత విద్య పట్ల ఆసక్తి చూపించడం లేదు. గత ప్రభుత్వం మన బడి నాడు–నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టి చాలా వరకు పూర్తి చేసింది. అయినప్పటికీ అనేకమంది పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదవాలనే ఆసక్తిని గ్రహించి, అన్ని ప్రైవేటు స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్యను బట్టి 25 శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌లో ఖచ్చితంగా ఉచిత విద్యను అందించేలా ఏర్పాట్లు చేశారు. అప్పట్లో అనేకమంది ఉచిత విద్య పట్ల ఆసక్తి చూపించారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వారికి దగ్గరలోని పాఠశాలలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.
జిల్లాలో 563 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు
జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 563 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా, వీటిలో 1,047 సీట్లను పేద విద్యార్థుల ఉచిత విద్యకు ప్రభుత్వం కేటాయించింది. వాటిలో ఇప్పటి వరకు 787 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 25 శాతం నిబంధన మేరకు ఇంకా ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించాల్సి ఉంది. తల్లికి వందనం పథకంలో ఎక్కువ నిధులు ఇస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు ఉచిత విద్యకు తక్కువ మొత్తంలో కేటాయించడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఉచిత విద్య పథకానికి మక్కువ చూపడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఉచిత విద్యకు ఇచ్చే మొత్తాన్ని పెంచితే వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా పేదలు ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌లో చదవాలనే ఆకాంక్ష నెరవేరుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ప్రైవేటు స్కూళ్లలో పేదలకు ఉచిత విద్య పథకం మంచిదే అయినప్పటికీ విద్యాశాఖ బలవంతంగా పిల్లలను ప్రవేటు స్కూళ్లలో చేర్చడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థల సంఖ్య తగ్గుతోంది. జిల్లాలోని 1,047 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను ఉచిత విద్య పథకంలో ప్రవేటు స్కూళ్ళలో చేర్పించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. గత ప్రభుత్వం నాడు–నేడు పథకంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తిచేసి అన్ని వసతులు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చు.
– బొర్రా గోపీమూర్తి, ఎమ్మెల్సీ
రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించినా, విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.13 వేలు మాత్రమే జమ చేస్తోంది. అయితే ఉచిత విద్యనందించే పాఠశాలలకు రూరల్, అర్బన్ ఏరియాలను పరిగణనలోకి తీసుకుని రూ. 6 వేల నుంచి రూ.11 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. ఉచిత విద్య పథకంలో సీటు పొందిన విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించకపోవడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు తల్లికి వందనం పథకం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.


