చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.20 కోట్లు | - | Sakshi
Sakshi News home page

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.20 కోట్లు

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.20 కోట్లు నాడు–నేడు పనులు పూర్తి చేయాలి 22 ఏ కేసుల పరిష్కారానికి హాజరుకావాలి సైబర్‌ నేరాలపై అప్రమత్తం

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.2,20,68,980 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 141 గ్రాముల బంగారం, 3.111 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ. 1,000, రూ. 500 నోట్ల ద్వారా రూ.25,500 లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకు శ్రీవారికి రూ.11,03,449 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.

భీమవరం: విద్యారంగంలో పాఠశాలల్లో ఉన్న లోపాలను సవరించి మెరుగైన సౌకర్యాలు ఉపాధ్యాయులకు కల్పించాలని, గత ప్రభుత్వం నాడు– నేడు కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల అదనపు గదుల నిర్మాణం 80–90 శాతం పూర్తకాగా మిగిలిప పనులకు నిధులను కేటాయించి వెంటనే నిర్మించాలని శాసనమండలి దృష్టికి తీసుకొచ్చినట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి తెలిపారు. స్థానిక యూటీఎఫ్‌ భవనంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిధులు, పర్యవేక్షణ లేక మూలనపడ్డ ఆర్వో ప్లాంట్లను త క్షణం వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై పోరాటం చేస్తున్న తనను వచ్చే ఏడాదిలో జరిగే ఉభయగోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరిగి గెలిపించాలని కోరారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్‌ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతికుమార్‌ మాట్లాడారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): నిషేధిత భూముల జాబితా 22ఎ కేసుల పరిష్కారానికి రైతులు తమ భూములకు సంబంధించి పూర్తి ఆధారాలతో విచారణకు హాజరు కావాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి కోరారు. కలెక్టర్‌ కార్యాలయంలోని చాంబర్‌లో బుధవారం పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్స్‌ కార్యక్రమాల్లో అందిన భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక విచారణ నిర్వహించారు. ఈ విచారణను కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి సంయుక్తంగా నిర్వహించారు. సంబంధిత మండల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని కేసులను పరిశీలించారు. మొత్తం 15 (22–ఏ) కేసులను పరిశీలించగా, అందులో 7 కేసులు పూర్తిగా పరిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, అర్జీదారులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: సైబర్‌ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పెదవేగి డీపీటీసీ చీఫ్‌ లా ఇన్‌స్ట్రక్టర్‌ ఆకుల రఘు కోరారు. ఏపీ నిట్‌లో బుధవారం సైబర్‌ జాగరూక్త దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. సెల్‌ఫోన్లకు వచ్చే లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. పొరపాటున చేస్తే బ్యాంకు ఖాతాలలో సొమ్ములు, విలువైన డేటాను చోరీ చేస్తున్నారన్నారు. మోసాలకు అవకాశం ఇవ్వకుండా ఎవ్వరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంప్యూటర్‌ పాస్‌వర్డ్‌లు క్రమం తప్పకుండా మార్చుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement