మట్టి దోపిడీని సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

మట్టి దోపిడీని సహించేది లేదు

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

మట్టి దోపిడీని సహించేది లేదు

చెరువులో అక్రమాలపై గుడాల గోపికి వివరిస్తున్న ప్రజలు, పాత గట్టును తవ్వేసిన దృశ్యం

పాలకొల్లు సెంట్రల్‌: గ్రామాభివృద్ధి ముసుగులో చెరువు మట్టిని అమ్ముకుంటే సహించేది లేదని వైఎస్సార్‌ సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి హెచ్చరించారు. పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలోని పశువుల చెరువు గట్లు బలహీనంగా ఉన్నాయని, వాటిని ఆధునికీకరిస్తున్నామని మాయమాటలు చెప్పి అధికార పార్టీ నాయకులు మట్టిని విక్రయించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అక్రమాలను అడ్డుకున్న మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు దుర్భాషలాడటం, వారి కుటుంబ సభ్యులను విమర్శించడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. సుమారు 5.22 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువును సర్వే చేసి, అన్యాక్రాంతమైన గట్టు భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామ ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఐక్యంగా పోరాడి కోర్టును ఆశ్రయించడంతోనే ఈ మట్టి దందాకు బ్రేక్‌ పడిందని గోపి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు వచ్చేలోపే చెరువు చుట్టూ ఉన్న సుమారు 150 కొబ్బరి చెట్లను తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి ఆదాయం వచ్చే చెట్లను ఎలా నరికేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నంత సేపు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి, కోర్టు ఆదేశాలు వచ్చాక స్పందించడం విచారకరమన్నారు. చెరువు మట్టిని తీయాల్సి వస్తే ఆ మట్టిని గ్రామాభివృద్ధి పనులకై నా వాడాలని లేదా బహిరంగ వేలం వేసి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చాలని డిమాండ్‌ చేశారు. వేసవిలో మూగజీవాలకు తాగునీరు అందించాల్సిన చెరువును ఎండగట్టి, స్వలాభం కోసం మట్టిని అమ్ముకోవాలని చూస్తే సహించేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు యడ్ల తాతాజీ, రవి, నరసింహరావు, సరిళ్ల రామారావు, తోకల సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.

గుడాల గోపి

Advertisement
 
Advertisement
Advertisement