బుట్టాయగూడెం : గిరిజనుల పాలిట కల్పతరువు ఇప్ప పువ్వు. వేసవి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ప్రధాన జీవనోపాధిగా నిలుస్తోంది. అడవిపైనే ఆధారపడి బతుకుతున్న ఆదివాసీలకు పోడు వ్యవసాయం తర్వాత అటవీ ఉత్పత్తుల సేకరణే ముఖ్యం. ముఖ్యంగా వేసవి కాలంలో లభించే ఇప్పపువ్వు గిరిజనుల ఆర్థిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి, చెట్లపై నుంచి రాలిన పువ్వులను సేకరించి, వాటిని మధ్యాహ్నం వరకు ఇంటికి చేర్చి ఎండబెట్టడం వీరి దైనందిన ఉపాధిలో భాగం.
మూడు నెలల పాటు ఉపాధి
మన్యం ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఇప్పచెట్ల ద్వారా సుమారు మూడు నెలల పాటు పని దొరుకుతుంది. ఖరీఫ్, రబీ వ్యవసాయ పనులు ముగిసే సమయానికి ఇప్పచెట్లు విరగబూస్తాయి. గాలికి నేలరాలే ఈ పువ్వులను గిరిజనులు అత్యంత శ్రద్ధతో సేకరిస్తారు. వీటితో పాటు మొర్రి పండ్లను కూడా సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించడం ద్వారా తమ జీవనోపాధిని సాగిస్తుంటారు.
ఇప్పపువ్వుతో ఔషధాల తయారీ
గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వులో ఎన్నెన్నో ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నాయి. దీని నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఇప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దగ్గు, దంత సంబంధిత వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్పపువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. ఆయుర్వేదంలో దీనిని మధుక వృక్షం అని పిలుస్తారు. వైద్యశాస్త్రంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గిరిజన ప్రాంత ప్రజలు ఈ చెట్లను మాతృమూర్తిగా భావిస్తారు.
ఇప్పపువ్వులో ఎన్నెన్నో పోషకాలు
ఇప్ప గింజల నుంచి తీసిన నూనెలో పుష్కలమైన పోషక విలువలు ఉన్నట్లు శాసీ్త్రయంగా నిరూపితమైంది. భారత శాసీ్త్రయ సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1999లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం, ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదారను తయారు చేయవచ్చు. దీనితో జామ్, కేక్‌లు, చాక్లెట్‌లు తయారు చేసే విధానాన్ని కూడా కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఎండిన వేప ఆకులను కలిపే సంప్రదాయ పద్ధతిని వీరు పాటిస్తారు. చాలామంది గిరిజనులు దీనిని నేరుగా ఆహారంగా కూడా తీసుకుంటారు.
ధర లేక తగ్గుతున్న సేకరణ ఆసక్తి
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో సుమారు 10 వేలకు పైగా ఇప్ప చెట్లు ఉన్నట్లు అంచనా. బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇవి అధికంగా ఉన్నాయి. అటవీ శాఖ కూడా ఖాళీ ప్రదేశాల్లో వేల సంఖ్యలో ఈ చెట్లను పెంచుతోంది. గిరిజనులు సేకరించిన పువ్వులను జీసీసీ అధికారులతో పాటు ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం సరైన మద్దతు ధర లభించకపోవడంతో గిరిజనులు వీటి సేకరణపై ఆసక్తి తగ్గించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్ప చెట్ల నరికివేత కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పచెట్టు
వేసవి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ఉపాధి
గిటుబాటు ధరలేక తగ్గుతున్న పువ్వుల సేకరణ
జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్న గిరిపుత్రులు


