కుంగుతున్న గోదావరి గట్టు రోడ్డు | - | Sakshi
Sakshi News home page

కుంగుతున్న గోదావరి గట్టు రోడ్డు

May 6 2026 9:01 AM | Updated on May 6 2026 9:01 AM

కుంగుతున్న గోదావరి గట్టు రోడ్డు పాలిసెట్‌లో 92 శాతం ఉత్తీర్ణత పాఠ్య పుస్తకాల రాక గృహ గణన పరిశీలన రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా 235 దరఖాస్తులకు పరిష్కారం

నరసాపురం: పట్టణంలోని గోదావరి గట్టు రోడ్డు ధ్వంసమవుతోంది. పడవల రేవు నుంచి కొండాలమ్మ గుడి వరకు రోడ్డుకు పలు చోట్ల గోతులు పడ్డాయి. రోడ్డు చాలాచోట్ల కుంగిపోయింది. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా మార్నింగ్‌ వాక్‌ చేసేవారు, ప్రస్తుత వేసవిలో సాయంత్రం వేళలో గోదావరి తీరానికి విహారానికి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. రోడ్డు సవ్యంగా లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపల్‌ అధికారులు రోడ్డు మరమ్మతులపై దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

భీమవరం: పాలిసెట్‌ పరీక్షా ఫలితాల్లో జిల్లాలో 92 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత నెలలో నిర్వహించిన పరీక్షకు 8,153 మంది హాజరుకాగా వారిలో 7,501 మంది ఉత్తీర్ణత సాధించారు. 4,650 మంది బాలురకు 4,213 మంది, 3,503 మంది బాలికలకు 3,288 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో టి.సాయి విష్ణుతేజ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్‌ సాఽధించగా, తోట మానస 4వ ర్యాంక్‌, పిండి జగన్‌ నర్సింహస్వామి 5వ ర్యాంక్‌, ముల్లు రోహిత్‌ 6వ ర్యాంక్‌, కొప్పర్తి శేషసాయి వెంకటకృష్ణ చైతన్య 7వ ర్యాంక్‌, టీబీ దివ్య 11వ ర్యాంక్‌, రెడ్డి వరుణ్‌కుమార్‌ 14వ ర్యాంక్‌, బీవీవీ యశ్వంత్‌ 15వ ర్యాంక్‌, సంగినీడి జయరామ్‌ 16వ ర్యాంక్‌ సాధించారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 1,98,999 మంది విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికి సుమారు 13 లక్షల పుస్తకాలు అవసరం కాగా నేడు ప్రభుత్వ పుస్తక విక్రయ కేంద్రానికి 10,03,000 పుస్తకాలు వచ్చాయని జిల్లా మేనేజర్‌ పీవీ సుధాకర్‌ వెల్లడించారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల టైటిల్స్‌ మారినట్లు తెలిపారు. మరిన్ని పుస్తకాలు రావాల్సి ఉందని వెల్లడించారు. మరో రెండు రోజులలో ఆర్టీసీ బస్సుల్లో పూర్వపు జిల్లా పరిధిలో 48 మండలాలకు అవసరమైన అన్ని టెక్స్‌ట్‌ బుక్స్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.

అత్తిలి: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గృహ గణన కార్యక్రమంలో భాగంగా అత్తిలిలో నిర్వహిస్తున్న గృహ గణనను జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న సమాచారాన్ని పరిశీలించారు. ఇంటింటికి వెళ్లినప్పుడు 33 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అత్యంత పారదర్శకంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అత్తిలి తహసీల్దార్‌ దశిక వంశీ పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): రెవెన్యూ క్లినిక్స్‌ కార్యక్రమం జిల్లాలో మంచి ఫలితాలను అందిస్తోందని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)తో పాటు సమాంతరంగా రెవెన్యూ క్లినిక్స్‌ నిర్వహించడం ద్వారా భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. 2025 డిసెంబర్‌ 29న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా 2026 మే 4 వరకు మొత్తం 16 విడతల్లో క్లినిక్స్‌ నిర్వహించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 632 దరఖాస్తులు అందగా, వాటిలో 235 దరఖాస్తులకు పరిష్కారం చూపించామని, 114 దరఖాస్తులను తిరస్కరించామని, ఇంకా 283 దరఖాస్తులు వివిధ దశల్లో పరిష్కారానికి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం లభిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement