భీమవరం: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు భీమవరంలో నిర్వహించిన భారీ ర్యాలీతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పట్టణంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి.. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. భీమవరం పట్టణంలో ఇరుకు రోడ్లతో ప్రయాణికులు, ప్రజలు నిత్యం నరకం చూస్తుంటారు. రోడ్లపైనే పార్కింగ్‌లు, చిరువ్యాపారుల దుకాణాలతో వాహనాలు వెళ్లాలంటే ఇబ్బంది తయారైంది. విద్యాసంస్థల బస్సులు పెద్దసంఖ్యలో రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ ఇన్నా కావు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. పట్టణంలోని నరసయ్య అగ్రహారంలోని బీజేపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ, రైల్వే ఓవర్ బ్రిడ్జి, కొత్తబ స్టాండ్ సెంటర్, పోలీసు బొమ్మ సెంటర్, అంబేడ్కర్ సెంటర్, జువ్వలపాలెం రోడ్డు మీదుగా అడ్డ వంతెన వరకు సాగింది. ర్యాలీలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే అంజిబాబుతో సహా పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా ర్యాలీలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడిరోడ్డుపై ఎంతతీవ్రత ఒకవైపు, వాహనాలు ముందుకు కదలక సుమారు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. ర్యాలీలు, ధర్నాలు ప్రధాన రోడ్లుపై నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ట్రాఫిక్ నిలిచిపోయి ఇబ్బందులు


