12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

May 6 2026 9:01 AM | Updated on May 6 2026 9:01 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఎస్సీ నాయకులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా పీఆర్‌సీ అమలు చేయకపోవడం వల్ల సుమారు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెలాఖరులోపు ఉద్యోగులకు రావాల్సిన రూ. 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో సచివాలయ హంగుల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తూ, ఉద్యోగుల సమస్యలను విస్మరించడం సరికాదని విమర్శించారు. ప్రజా సేవలో నిరంతరం కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతిని ఇష్టపడటం లేదని తెలిపారు. అమరావతి చంద్రావతిగా మారిందని ఎద్దేవా చేశారు. అప్పులు తెచ్చి రాజధాని కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలగా రవికుమార్‌, పెద్దిరాజు, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement