నరసాపురం రూరల్: స్థానిక స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ ఎక్స్‌పో’ మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కొండవీటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ దాసి రాజు విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల సాంకేతిక ప్రాజెక్టులను ఆయన స్వయంగా పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ కుమార్ పాలకవర్గ సభ్యుడు అడ్డాల శ్రీహరి, ట్రెజరర్ కొండవీటి స్వామి, వైస్ ప్రిన్సిపాల్ గోపిచంద్ పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ పూర్తి చేసుకున్న దివ్యాంగుడు ఏడీవీ సత్యనారాయణ, తన తల్లిదండ్రులతో కలిసి భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెంటపాడు గవర్నమెంట్ పోస్ట్ బేసిక్ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేసిన డఫ్ అండ్ డంబ్ విద్యార్థి ఏడీవీ సత్యనారాయణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం గర్వకారణమన్నారు. అనంతరం సత్యనారాయణను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ పాల్గొన్నారు.
గణపవరం: గణపవరం బస్టాండు ప్రాంతంలో సంచరిస్తున్న చుక్కల దుప్పి ఎట్టకేలకు అటవీప్రాంతానికి తరలించారు. రెండు రోజుల క్రితం బస్టాండు ప్రాంతంలో వెంకయ్యకాల్వ గట్టున తిరుగుతున్న చుక్కలదుప్పిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రదేశంలో ఉంచారు. జిల్లా అటవీ అధికారి డిఏ కిరణ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్ల పరిధిలో సహజ ఆవాస ప్రాంతానికి ఈచుక్కల దుప్పిని తరలించారు. గణపవరం ఎస్సై మణికుమార్, పశుసంవర్థక శాఖ ఏడీ నాయక్, ఫారెస్ట్ బీట్ అధికారులు రాంప్రసాద్, రాజేష్ పాల్గొన్నారు.
ఉంగుటూరు: ఉంగుటూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న వన్య ప్రాణులు నీరు లేక విలవిల్లాడుతున్నాయి. వారం రోజుల క్రితం ఒక దుప్పి చనిపోయింది. అటవిలో పని చేసే ఉపాధి కూలీలు దుప్పి చనిపోయిన ఘటనను ఆలస్యంగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే చనిపోయిన ఆ దుప్పిను అటవీ అధికారులు ఏం చేశారో? వారికే తెలియాల్సి ఉంది. ఉంగుటూరు మెట్ట ప్రాంతంలో 3200 ఎకరాలు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఏ–బ్లాకు ఫారెస్టు ఉంగుటూరు, నారాయణపురం, గోపినాథపట్నం, గ్లొలగూడెం గ్రామాలను ఆనుకుని ఉంది. బి–బ్లాకు ఫారస్టు గుళ్లపాడు, నీలాద్రిపురం, ఆవుపాడు, ప్రకాశరావుపాలెం, వెంకట్రామన్నగూడెం, వెల్లమిల్లి గ్రామాలను ఆనుకుని ఉంది. అయితే ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉండే కుంటల్లో నీరు లేకపోవడంతో వన్య ప్రాణులు ఇబ్బందులు పడుతున్నాయి.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పీవీ రమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో రాయల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పేటీఎం కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. 20 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న యువతను సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్ పోస్టులకు ఎంపిక చేస్తారని వివరించారు. అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ కోడ్‌లో హాజరుకావాలని, అవసరమైన డాక్యుమెంట్స్, రెజ్యూమ్ తీసుకురావాలని సూచించారు. మరిన్ని 88868 82032, 74161 18388 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.


