ఎరువులు అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎరువులు అందుబాటులో ఉండాలి

May 6 2026 9:01 AM | Updated on May 6 2026 9:01 AM

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఖరీఫ్‌– 2026 సీజన్‌కు రైతులకు అవసరమైన ఎరువులు, ముఖ్యంగా యూరియా, డీఏపీ సమృద్ధిగా ఉండేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫెర్టిలైజర్స్‌ రవీంద్ర యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం బృందంతో కలిసి ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతలపూడి, ఏలూరు మండలాల్లో పర్యటించారు, ఎరువుల రిటైల్‌ డీలర్ల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర యాదవ్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ నెలలో యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలు అధికంగా నమోదైన నేపథ్యంలో, ఆ పెరుగుదలకు కారణాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. డీలర్ల వద్ద ఉన్న స్టాక్‌ వివరాలు, విక్రయ రికార్డులు, బిల్లులు, రైతులకు సరఫరా విధానం వంటి అంశాలను పరిశీలించి, సరైన మార్గదర్శకాలు అందించారు. అధికారులు ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉంచాలని, అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎరువులు సరైన సమయంలో, సరైన మోతాదులో అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

యూరియా అధికంగా వాడొద్దు

చింతలపూడి: రైతులు పంట సాగులో యూరియాను మోతాదుకు మించి వాడకూడదని, అధిక వాడకం వల్ల పంటలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని రవీంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం చింతలపూడి సబ్‌ డివిజనన్‌లో కేంద్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక ఎరువుల దుకాణాలను, డీసీఎంఎస్‌ గొడౌన్‌న్‌ను వారు తనిఖీ చేశారు. గొడౌన్‌న్‌లో ఎరువుల ధరలు, ఈ–పాస్‌ ద్వారా జరుగుతున్న విక్రయాలు, స్టాక్‌ రిజిస్టర్లు, ప్రస్తుత నిల్వలను బృందం సభ్యులు పరిశీలించారు. గత మూడేళ్ల యూరియా, డీఏపీ విక్రయాల నివేదికలను సేకరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement