వేడుకగా వసంతోత్సవం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా వసంతోత్సవం

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

వేడుకగా వసంతోత్సవం మాల మహానాడు నాయకుల అరెస్ట్‌ వర్షంపై అప్రమత్తం వ్యక్తి బలవన్మరణం

ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాధిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి, భక్తులకు వసంతాలను అందజేశారు. రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు.

ద్వాదశ కోవెల ప్రదక్షిణలు

ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. అందులో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో ఉన్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. అలాగే శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

నేటి నుంచి ఆర్జిత సేవలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యా ణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.

భీమవరం: ఆకివీడులో దళితులపై అక్రమ కేసు లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులకు అండగా నిలవడానికి వెళుతున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్‌ను భీమవరంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పుష్ప రాజ్‌ మాట్లాడుతూ కులమతాలను రెచ్చగొట్టేలా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు చేస్తున్న అరాచకాలను తక్షణం ఆపాలన్నారు. రఘురామ వ్యవహారంపై ప్రభుత్వం కలుగజేసుకుని చట్టం అందరికీ ఒకేలా వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆకివీడులో నిజనిర్ధారణ, పీస్‌ కమిటీలు ఏర్పాటుచేసి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలన్నారు. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి నేతల సువర్ణరాజు, జిల్లా అధ్యక్షుడు ఇంటి సుందరకుమార్‌, తోర్లపాటి భాగ్యరాజ్‌, దాసరి చిరంజీవి తదితరులు ఉన్నారు.

భీమవరం: జిల్లాలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ డీఎం ఎం.ఇబ్రహీమ్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, పంటను గట్టుకు చేర్చి భద్రపరుచుకోవాలన్నారు. తేమ శాతం పెరగకముందే కోత యంత్రాలతో మాసూళ్లుకు సిద్ధం కావాలన్నారు. ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులుంటూ కంట్రోల్‌ రూమ్‌ 81216 76653 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

వీరవాసరం: మానసిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఏ ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఆయన తెలిపి న వివరాల ప్రకారం.. పాలకోడేరు మండలం కొండేపూడికి చెందిన కడలి శ్రీనివాస్‌ (40) కొన్నేళ్లుగా భార్యతో వేరుగా ఉంటున్నాడు. నెలమూరులో సైకిల్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 2న శ్రీనివాస్‌ ఉత్తరపాలెం వెళ్లాడు. మానసికంగా కుంగిపోయిన శ్రీనివాస్‌ ఉత్తరపాలెంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ వద్ద ఉరి వేసుకుని మృతిచెందాడు. కుటుంబసభ్యులు రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement