తణుకు అర్బన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (వైఎస్సార్‌టీఏ) నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో ఈనెల 6న ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించి పోస్టర్‌ను ఆదివారం ఆయన తణుకులో పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు మురాల సుధాకర్ మాట్లాడుతూ మహాధర్నా రూపంలో చేస్తున్న ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతిఒక్కరూ కలిసిరావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఉపా ధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను, గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో మహాధర్నా చేపట్టామన్నారు. వైఎస్సార్‌సీపీ టీచర్స్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్వీ జాకబ్‌బాబు, జిల్లా కోశాధికారి టి.పల్లయ్య, ఇరగవరం మండల శాఖ బాధ్యులు పాల స్మిత్, కొల్లి జయబాబు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


