భీమవరం: కార్మికుల హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, మండల న్యాయసేవా సంస్ధ కట్టుబడి ఉంటాయని, ఈ–శ్రమ్, ఇన్సూరెన్సు, పింఛన్ వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శనివారం సంస్థ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలున్నా సంస్థను సంప్రదించాలని, కార్మికులు తమ సమస్యలను తీర్చగలిగే సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎ.శ్రీలక్ష్మి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, ఒకటో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, వన్‌టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


