వృద్ధులే టార్గెట్.. బంగారు ఆభరణాల దోపిడీ
● నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
● రూ.7.70 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకుపోతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వివరాలు వెల్లడించారు. నిందితులు ద్వారకాతిరుమల మండలం గొల్లగూడానికి చెందిన చవటపల్లి రామకృష్ణ, చవటపల్లి నాగరాజు, జంగారెడ్డిగూడెం పట్టణం రాముడుకుంటకు చెందిన ఉర్జని జగదీష్, కలపాల దిలీప్ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆయుధాలతో బెదిరించి ఆభరణాలను బలవంతంగా లాక్కొనిపోయినట్లు తెలిపారు. వీరిపై ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, లక్కవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల నుంచి రూ.7.70 లక్షల విలువైన చోరీ సొత్తు, రెండు మోటార్‌సైకిళ్లు, నాలుగు మొబైల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. జీలుగుమిల్లి, లక్కవరం పరిధిలో జరిగిన చోరీ కేసులకు సంబంధించి ఇంకా చోరీ సొత్తు రికవరీ కావాల్సి ఉందని చెప్పారు. కేసు ఛేదనకు కృషి చేసిన జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్, క్రైం పార్టీ ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, ఎస్‌కే షానుబాబును ఏఎస్పీ అభినందించారు.


