ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. దాంతో నెలరోజుల పాటు తిరువీధుల్లో జరిగిన గ్రామోత్సవాలు సైతం ముగిశాయి. ఆఖరి రోజు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా స్వామి, అమ్మవార్లకు భక్తులకు నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన కూడలిలోని విలాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ముదినేపల్లి రూరల్: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మల్లంపల్లి వెంకట సుబ్బారావు (50) బుధవారం మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సుబ్బారావు అప్పుల బాధ భరించలేక ఈ నెల 6న పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా విజయవాడ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎంపీడీవో వై రామకృష్ణతో పాటు కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేశారు.
భీమవరం: భీమవరం పట్టణం ఉండి రోడ్డులోని సింహా కియా షోరూమ్ వద్ద నూతన సెల్లోస్ కారును డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆవిష్కరించారు. కొత్త సెల్లోస్ సరికొత్త కే3 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించినట్లు సింహా మోటార్స్ అధినేత రావెళ్ల సతీష్ చెప్పారు. దీనివల్ల కారు స్థిరత్వం, భద్రత గతంలోకంటే మెరుగ్గా ఉంటుందన్నారు. కొత్త సెల్లోస్ మాగ్మారెడ్, ఫ్రఫ్‌స్ట్ బ్లూ, ఐవరీ సిల్వర్ గ్లోస్ వంటి పది రంగుల్లో లభ్యమవుతుందన్నారు. సింహా కియా జీఎం క్రాంతికుమార్ మాట్లాడుతూ కొత్త ఫీచర్లు, పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లో ఐవీటీ, డీసీటీ, 6ఏటీ, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ బేసిక్ మోడల్ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. కొత్త సెల్లోస్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.99 లక్షల నుంచి అందుబాటులో ఉంటాయన్నారు.
పెనుమంట్ర: మార్టేరు– పెంటపాడు స్టేట్ హైవే రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు గ్రామానికి చెందిన నాగరాజు (40), చింటూ (15), ప్రభాస్ (19) అనే వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని మరో మోటార్ సైకిలిస్టు వీరిని ఢీకొట్టి వెళ్లిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు
ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు


