శ్రీవారి కొండపై సంక్రాంతి సంబరాలు
● వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
● అలరించిన కళాకారుల వేషధారణలు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి పండుగను పురస్కరించుకుని ఆలయ తూర్పు ప్రాంతంలో ఈ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ ఈఓ వై.భద్రాజి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, తదితరులు చినవెంకన్న చిత్రపటానికి పూజలు జరిపి, భోగి మంటను వెలిగించి, సంబరాలను ప్రారంభించారు. ఆ తరువాత చిన్నారులకు భోగిపళ్లు పోశారు. అనంతరం పల్లెల్లో సంక్రాంతి వేడుకలు ఎలా జరుపుతారో అదే విధంగా సంబరాలు జరిపారు. పూరి గుడిసె, ఎడ్ల బళ్లు, అశ్వాలు, కోడి పుంజులు, డూడూ బసవన్నలు, కళాకారుల విన్యాసాలు, కోలాట భజనలతో ఆ ప్రాంతం పండుగ శోభను సంతరించుకుంది. అలాగే భక్తులు గజలక్ష్మి ఆశీర్వచనాలను పొందారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుడబుక్కలు, పిట్టలదొర, చిలక జోస్యం తదితర వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి. యువతులు, మహిళలు రెండు తాడి చెట్ల మధ్య ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఊగుతూ సందడి చేశారు. రోకళ్లతో ఒడ్లు దంచి సంబరపడ్డారు. భక్తులు ఎడ్ల బండిపై తిరిగారు. అలాగే మహిళలు బావిలోని నీటిని తోడారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఫొటోలు, సెల్ఫీలు దిగి సందడి చేశారు. వరి, మొక్కజొన్న, చెరకు, అరటి వంటి పంటలు వేసి, పల్లె సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టుగా క్షేత్రంలో ఈ వేడుకలను జరపడం ప్రత్యేకతను సంతరించుకుంది.
శ్రీవారి కొండపై సంక్రాంతి సంబరాలు
శ్రీవారి కొండపై సంక్రాంతి సంబరాలు
శ్రీవారి కొండపై సంక్రాంతి సంబరాలు


