సంక్రాంతి వైభవం చాటేలా..
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ముందెన్నడూ లేని విధంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు ఆలయ ఈఓ వై.భద్రాజి పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా కొండపైన షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సోమవారం ముస్తాబు చేశారు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఏవిధంగా జరుగుతాయో కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. పచ్చని పంటలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎలా ఉంటుందో చూపేందుకు వరి మడులు ఏర్పాటు చేసి, నాట్లు వేస్తున్నారు. అలాగే చెరకు, అరటి పంటలు వేశారు. ప్రస్తుతం మొక్కజొన్న సాగు పనులు, ఎడ్ల బండ్లకు రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. పూరి గుడిసెను నిర్మించి దాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇంకా ఈత, తాడి చెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా సంక్రాంతి విశిష్టతను తెలిపే చిత్రమాలికలు, రంగవల్లులు వేయాల్సి ఉంది. దేవస్థానం డీఈలు టి.సూర్యనారాయణ, సుధాకర్‌ల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పనులు మంగళవారం సాయంత్రం నాటికి పూర్తి కానున్నాయి. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే ఈ సంక్రాంతి సంబరాల్లో వేలాది మంది భక్తులు పాల్గొనాలని ఈఓ కోరారు.
సంక్రాంతి వైభవం చాటేలా..


