పాలకొల్లులో చెస్ పోటీలు
పాలకొల్లు సెంట్రల్: మేధా చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ రాపిడ్ చదరంగం పోటీలు సోమవారం పాలకొల్లులో జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఏపీ స్టేట్ జనరల్ సెక్రెటరీ జగదీష్, మేధా చెస్ అకాడమీ ప్రెసిడెంట్, ఆడిటర్ పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, చాంబర్స్ ప్రెసిడెంట్ కారుమూరి నరసింహరావు, మద్దాల వాసులు మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. పోటీల్లో కాకినాడ జిల్లా వాసి జాన్సజాన్ సాయి సంతోష్ ప్రథమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన షణ్ముఖ రెడ్డి ద్వితీయ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మజ్జి రామ్‌చరణ్‌తేజ్ తృతీయ బహుమతి సాధించారు. వివిధ కేటగిరిలో అండర్ 7, 9, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా బహుమతులు అందజేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా టారిఫ్ దరఖాస్తులపై ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20న తిరుపతిలో, 22, 23 తేదీలలో విజయవాడలో, 27వ తేదీన కర్నూలులో ఈ ప్రజా విచారణలు జరుగుతాయన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యక్ష విధానంలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతాయన్నారు.


