నువ్వుల పంటతో రైతులకు అధిక లాభాలు
చింతలపూడి: రబీ కాలంలో సార్వా వరి తరువాత రైతులు నూనె గింజల పంటను సాగుచేస్తే నాణ్యమైన పోషక విలువలున్న నూనెను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకుని ఆర్థికంగా పరిపుష్టి సాధించవచ్చని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ కె ఫణి కుమార్ రైతులకు సూచించారు. సోమవారం చింతలపూడి మండలం సమ్మెటవారిగూడెం గ్రామంలో నువ్వు పంట దిగుబడి – యాజమాన్య పద్ధతులు అనే అంశంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సార్వా వరి పంట తర్వాత నువ్వులు వంటి నూనె గింజల పంటలు వేసుకుంటే లాభదాయంగా ఉంటుందన్నారు. పెట్టుబడి వ్యయం తక్కువని, చీడపీడల తాకిడి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఎకరా వరికి కావలసిన నీటితో ఐదు ఎకరాల నువ్వు పంట సాగు చేయవచ్చని. చెప్పారు. తొలిదశలో కలుపు నివారణ, సమతుల్యమైన ఎరువులను వాడుతూ కేవలం 2, 3 తడులతో పంటను పండించుకోవచ్చన్నారు. నువ్వులకు మార్కెట్ రేటు ఎక్కువగా ఉండి సాగు ఖర్చు తక్కువ వలన నువ్వు పంట సాగులో అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఏవో శ్రీ కె. మురళికృష్ణ, మాట్లాడుతూ జిల్లాలో నవ్వు పంట సాగుపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. తక్కువ నీటితో ఈ పంటను సాగు చేసి ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చునని తెలిపారు.
జిల్లా ఏరువాక కేంద్రం
కోఆర్డినేటర్ డాక్టర్ ఫణి కుమార్


