ఆలయాల చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
నరసాపురం రూరల్: ఆలయాల్లో జరుగుతున్న చోరీలకు సంబంధించి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సోమవారం డీఎస్పీ జి శ్రీవేద వివరాలు వెల్లడించారు. మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో తూర్పుతాళ్లులోని ఆంజనేయ స్వామి ఆలయం , కొత్తోటలోని దాసాంజనేయ స్వామి ఆలయం, కేపీ పాలెం సౌత్‌లో పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం, మోడీ గంగాలమ్మ అమ్మవారి ఆలయం, పేరుపాలెం నార్త్ గ్రామంలో కోదండ రామాలయం తదితర గ్రామాల్లోని ఆలయాల్లో ఇటీవల చోరీలు జరిగాయి. ఈ చోరీ కేసుల్లో నిందితుడైన కాళీపట్నం పడమర గ్రామానికి చెందిన కవురు లోకేశ్వరరావు అనే 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.1.57లక్షలు విలువ గల 1.420 కేజీల వెండి, రూ.1.77 లక్షలు విలువగల 14 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసు ఛేదించిన ఎస్సై జి.వాసును డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ దుర్గాప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


