ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆదరించాలి
పెనుగొండ: ప్రభుత్వ విద్యా సంస్థలకు దీటుగా సేవలందిస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. పెనుగొండలోని ఎస్వీకేపీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సరైన వనరులు, సదుపాయాలు సమకూర్చకపోవడంతో నిర్వహణతో పాటు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై విద్యాశాఖా మంత్రి లోకేష్ దృష్టికి రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, బుర్రా గోపి మూర్తిలతో కలసి తీసుకువెళ్లడం జరుగుతుందని, అదేవిధంగా శాసన మండలిలోనూ ప్రస్తావిస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, బుర్రా గోపీ మూర్తి మాట్లాడుతూ ఉన్నతాశయాలతో గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కళాశాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులు సేకరించిన విరాళాన్ని అతిథుల చేతుల మీదుగా పాలకవర్గానికి అందించారు. కార్యక్రమంలో సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కే రామచంద్రరాజు, పాలకవర్గ అధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ వైవీవీ అప్పారావు, కొల్లి వెంకట సూర్యనారాయణ, హైకోర్టు అడ్వకేటు ఇండుగపల్లి రామానుజరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ గుబ్బల తమ్మయ్యలు పాల్గొన్నారు.
ఇక్కడ సంక్రాంతి
ఎంతో అనుభూతి
భీమవరం: గత ఏడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది ఆగస్టు 15 లోపు ఆ చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శతాధిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చెప్పారు. సోమవారం భీమవరం విచ్చేసిన ఆయన నానాజీ కాంప్లెక్స్ వద్ద మాట్లాడారు. 20 ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించామని, భీమవరం టాకీస్ పతాకంపై నిర్మించిన 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి, ఆ చిత్రాల ట్రైలర్స్ అన్నీ ఒకే రోజు ఒకే వేదికపై ఆవిష్కరించామన్నారు. మిగిలిన 8 చిత్రాల ట్రైలర్స్‌ను ఒకేసారి విడుదల చేయబోతున్నామ న్నారు. ప్రతి సంక్రాంతికి భీమవరం వస్తానని, భీమవరం అనుభూతి మరువలేనని అన్నారు.
భీమవరం: భీమవరంలో అనసూయ చెస్ అకాడమీ, జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చదరంగ పోటీలు సోమవారం ముగిశాయని అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో 56 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. మొదటి 5 స్థానాల్లో కర్రి ఓంకారం (ఏలూరు), నీలి కుష్వంత్ (భీమవరం), ఫణిశెట్టి ధరణి (అమలాపురం), వజ్జి హేమంత్ కుమార్ (విజయవాడ), ఆముదాలపల్లి శరణ్ (భీమవరం) నిలిచారన్నారు. ఆర్యవైశ్య సంఘ భవనం అధ్యక్షుడు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, మెంటే పార్థసారథి విజేతలకు బహుమతులు అందజేశారు.
రాగి వైర్ల చోరీ ముఠా అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైర్లు చోరీ చేసే ముఠాని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన కామవరపుకోట మండలం కేఎస్ రామవరంలో వ్యవసాయ పొలంలో గల నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లలోని రాగివైరు చోరీకి గురైందన్నారు. దీనిపై రైతులు తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపధ్యంలో సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంనకు చెందిన కర్ని నాగశివ, చిలకలూరిపేట మండలం రామచంద్రాపురంనకు చెందిన గౌరవరపు దివాకర్‌బాబు, మంగళగిరి మండలం యర్రబాలెంకు చెందిన మహంకాళి కిషోర్, తెలంగాణ రాష్ట్రం మహాబూబ్‌నగర్ జిల్లా బెబ్బెరుకు చెందిన డక్కలి సురేంద్రలను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిని విచారించగా, మొత్తం 22 కేసులకు సంబంధించి 40 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైరు చోరీ చేసినట్లు తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆదరించాలి
ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆదరించాలి


