తిరువీధుల్లో శ్రీవారి వైభవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. అందులో భాగంగా శ్రీవారికి సోమవారం క్షేత్ర పురవీధుల్లో జరిగిన తిరువీధి సేవ స్వామివారి వైభవాన్ని చాటింది. తొలుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ తిరువీధి సేవ కన్నులపండువగా జరిగింది. తమ ఇంటి ముంగిటకు వచ్చిన చినవెంకన్నకు పెద్ద ఎత్తున భక్తులు నీరాజనాలు సమర్పించి, హారతులు పట్టారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.


