ఎంపీటీసీలకు అందని గౌరవం
గౌరవ వేతనం చెల్లించాలి
వెంటనే విడుదల చేయాలి
బుట్టాయగూడెం: గత ఏడాదిన్నరగా ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీటీసీలకు గౌరవ వేతనం చెల్లింపులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు అధికంగా ఉండడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇలా తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు. వేతనాల కోసం ఎంపీటీసీలు అధికారులను సంప్రదిస్తున్నా ఫలితం లేకుండా పోవడంతో నిరాశకు గురవుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం
ఏర్పడిన నాటినుంచి..
పోలవరం నియోజకవర్గంలో మొత్తం 94 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో బుట్టాయగూడెం మండలంలో 15 మంది, జీలుగుమిల్లి మండలం 9, పోలవరం 12, కుక్కునూరు 12, వేలేరుపాడు 7, కొయ్యలగూడెం 22, టి. నర్సాపురం మండలంలో 17 మంది చొప్పున ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలే ఉన్నారు. వీరికి నెలకు రూ. 3 వేల చొప్పున గౌరవ వేతనం అందించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్ 12వ తేదీన పగ్గాలు చేపట్టగా ఆ ఏడాదిలో పాత బకాయిలు చెల్లించారు. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర నుంచి గౌరవ వేతనం చెల్లించడంలేదని ఎంపీటీసీలు వాపోతున్నారు.
అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు
ఎంపీటీసీలు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులైనప్పటికీ కూటమి ప్రభుత్వం తమకు అధికార కార్యక్రమాల్లో కనీసం ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఎంపీటీసీలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా గ్రామాల్లోని కూటమి నేతలకే పెత్తనం ఇస్తున్నారని దీంతో తమకు ఎటువంటి గౌరవం ఉండటంలేదని వారు చెబుతున్నారు. తమకు అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
ఏడాదిన్నరకు పైగా విడుదల కాని గౌరవ వేతనం నిధులు
అత్యధిక శాతం వైఎస్సార్‌సీపీ సభ్యులు కావడంతో నిర్లక్ష్యం
ప్రోటోకాల్‌కు మంగళం పాడేసిన అధికారులు
కూటమి నేతలకే పెత్తనం
కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు. కార్యక్రమాల సమాచారం కూడా తెలియజేయకుండా కూటమి నాయకులతో చేయిస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం. ఎంపీటీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలి.
– గగ్గులోతు మోహన్‌రావు, వైస్ ఎంపీపీ, బుట్టాయగూడెం మండలం
ఎంపీటీసీలకు ఏడాదిన్నర నుంచి చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. మాకు రావాల్సిన గౌరవ వేతనం అందకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. బకాయిలు చెల్లిస్తే పండుగపూట ఎంపీటీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– గాలి దుర్గారావు, ఎంపీటీసీ, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం
ఎంపీటీసీలకు అందని గౌరవం
ఎంపీటీసీలకు అందని గౌరవం
ఎంపీటీసీలకు అందని గౌరవం


