పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్‌గా మార్చేశారు
కుక్కునూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుముక, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం బ్యారేజ్‌గా మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కుక్కునూరులో నూతనంగా నిర్మించిన అయితా శంకరయ్య సీపీఐ కార్యాలయం భవనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ లక్షల ఎకరాల భూమికి సాగునీరు, రాష్ట్ర నలుమూలలకు తాగునీరు, విద్యుత్ అందిస్తూ బహుళార్థకంగా ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ బ్యారేజ్‌గా మార్చిందని విమర్శించారు. సుమారు 33 వేల కోట్ల పరిహారం నిర్వాసితులకు ఇవ్వకుండా ఎగొట్టడానికి కూటమి ప్రభుత్వం మొదటి దశ, రెండో దశ అంటూ కొత్త పాట పాడుతుందన్నారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం చేపడితేనే రాష్ట్రం సస్యశ్యామలవుతుందని పేర్కొన్నారు. సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య, నాయకులు పాల్గొన్నారు.


