
పార్టీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్‌చార్జిగా జయసరిత
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్‌చార్జిగా పాలకొల్లుకు చెందిన రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి క్రరా జయసరితను నియమించారు. ఈ సందర్భంగా తనకు పదవి కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుది కళ్యాణి, ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్ర సాదరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీ హరిగోపాలరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అత్తిలి: మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగ సంఘటన సంఘ నాయకుడు నండూరి రమేష్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ప్రముఖులతో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా దివ్యాంగుల కోట కింద మంచిలి గ్రామానికి చెందిన నండూరి రమేష్‌ను జిల్లా అధికారులు ఎంపిక చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రమేష్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు కూడా గతంలో పొందారు.
నూజివీడు: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో హుండీలను చోరీ చేసిన దొంగను చాట్రాయి పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ గురువారం నూజివీడులో వివరాలు వెల్లడించారు. ఈనెల 13న సాయంత్రం చాట్రాయి ఊరి చివర పోలవరం వెళ్లే రోడ్డు మలుపులో ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చాట్రాయి వైపు నుంచి పోలవరం వైపునకు మోటార్‌సైకిల్‌పై వెళ్తూ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న పటాన్ సలార్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరు నగరంలోని పడమట వీధికి చెందిన పటాన్ సలార్‌ఖాన్(56)పై ఇప్పటి వరకు 51 దొంగతనం కేసులు ఉండగా ఏలూరు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 23, ఎన్‌టీఆర్ జిల్లాలో 3 చొప్పున కేసులు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి రూ.5,900 నగదు, మోటర్ సైకిల్‌ను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన నూజివీడు సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డీ రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు ఎం విజయ్‌భాస్కర్, జీ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లను అభినందించారు.
టి.నరసాపురం: ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం కె.జగ్గవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హెచ్‌సీ కె.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం కె.జగ్గవరం గ్రామానికి చెందిన బర్రి రాజేష్ (35) పదేళ్ల క్రితం తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన నెల రోజులకే ఆమె రాజేష్‌ను విడిచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాజేష్ తల్లి వద్ద ఉంటున్నాడని అతనికి చిన్నప్పటి నుంచి కొంచెం మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేదన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరి జీవితాన్ని భరించలేక ఈనెల 13న గుర్తు తెలియని మందు తాగి ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో, స్థానికులు గుర్తించి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. రాజేష్ అన్న ఏలియా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.

పార్టీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్‌చార్జిగా జయసరిత