తణుకు అర్బన్: వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా తణుకులో ముస్లింలు కదంతొక్కారు. శుక్రవారం పట్టణంలోని పెద్ద మసీదు నుంచి నరేంద్ర సెంటర్ వరకు ముస్లింలు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. తణుకు నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అధిక సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ముస్లింల మతపరమైన హక్కులను కాలరాస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ముస్లింలపై చూపుతున్న మొండి వైఖరి నశించాలని, వక్ఫ్ అల్లా సొత్తు అని ముస్లింలు కేవలం పరిరక్షకులని, వక్ఫ్‌ను రాజకీయం చేయొద్దంటూ నినదించారు. ముస్లింలకు సీపీఎం కార్యదర్శి పీవీ ప్రతాప్, నాయకులు కామన మునిస్వామి మద్దతు తెలిపారు. జమాత్ ఏ ఇస్లామీ హింద్ నాయకులు, ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


