
ఆణిముత్యాలు అమలయ్యేనా?
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ఉద్దేశించి గత ప్రభుత్వం పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి ఆణిముత్యాల పేరిట నగదు ప్రోత్సాహకాలు అందించింది. ఈ పథకాన్ని ఏటా అమలు చేయనున్నట్లు గత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 2023 –24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ ఏడాది కూడా నగదు ప్రోత్సాహకాలు అందుతాయని భావించారు. పదో తరగతి విద్యార్థులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సైతం ఈ ప్రోత్సాహకాలు అందించారు. ప్రతి గ్రూపులో టాపర్లను ఎంపిక చేసి వారికి ఈ ప్రోత్సాహకాలు అందించారు. ఆణిముత్యాలుగా ఎంపికై న విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను, నగదు పురస్కారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ప్రభుత్వం ఘనంగా సత్కరించి గౌరవించింది.
గత ఏడాది టాపర్లకు రూ.లక్ష బహుమతి
ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ వివిధ గ్రూపులు చదివిన విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను ఎంపిక చేసి టాపర్లకు రూ. లక్ష నగదు ప్రోత్సాహకం అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా అందచేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 75 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 50 వేలు అందచేశారు. ఇంటర్ విద్యార్థులకూ అమలు చేశారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ/ఎంఈసీ వంటి ప్రతి గ్రూపులో టాపర్లకు నగదు బహుమతులు అందజేశారు. నగదు పురస్కారంతో పాటు సర్టిఫికెట్, మెడల్స్ కూడా ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించారు.
జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ప్రోత్సాహకాలు
విజేతలకు నగదు ప్రోత్సాహకాలు కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం చేయకుండా నియోజకవర్గ, జిల్లా స్థాయికి వర్తింపజేశారు. నియోజకవర్గ స్థాయి టాపర్లకు రూ.15 వేలు, ద్వితీయ స్థానంలో రూ.10 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.5 వేలు అందచేశారు. జిల్లా స్థాయిలో టాపర్లకు రూ. 50 వేలు, ద్వితీయ స్థానం రూ. 30 వేలు, తృతీయ స్థానం రూ. 15 వేలు అందించారు. ఈ రెండు స్థాయిల్లో కూడా ఇంటర్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. జగనన్న స్ఫూర్తితో కొన్ని ప్రాంతాల్లో స్థానిక దాతల సహకారంతో పాఠశాల స్థాయిలో టాపర్లకు నగదు పురస్కారం అందచేశారు. పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానానికి రూ.3 వేలు, ద్వితీయ స్థానానికి రూ.2 వేలు, తృతీయ స్థానానికి రూ. వెయ్యి నగదు బహుమతులు అందచేశారు.
ఈ ఏడాది అందని మార్గదర్శకాలు
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి వారి భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అమలు చేసిన ఆ పథకానికి గత ఏడాది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి గొప్ప స్పందన లభించింది. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని, ఈ పథకాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని కోరారు. గత ఏడాది జూన్ 20 నాటికి అన్ని స్థాయిల్లో నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ ఏడాది విద్యార్థులకు ఇలాంటి నగదు పురస్కారం అందుతుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషంపై విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. జిల్లా విద్యాశాఖాధికారులకు ఎటువంటి మార్గదర్శకాలూ అందకపోవడంతో ఈ ఏడాది నగదు ప్రోత్సాహకాలు ఇస్తారా? లేదా? అన్నది సందేహంగా కనిపిస్తోంది.
గతేడాది పది టాపర్లకు రూ.లక్ష నగదు బహుమతి
జిల్లా, నియోజకవర్గాల స్థాయి
విజేతలకూ ప్రోత్సాహకాలు
ఈ ఏడాది ఇంతవరకూ అందని మార్గదర్శకాలు