● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల ఆన్లైన్ దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని హనుమకొండ ప్రాజెక్ట్ సీడీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న 19 పోస్టులకు గాను వచ్చిన 953 ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈనెల 29వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనను సీడీపీఓలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీడీపీఓ, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి విశ్వజ, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల్లో టాప్ హనుమకొండ..
హనుమకొండ జిల్లాలోని మూడు ప్రాజెక్టుల్లో హనుమకొండ, భీమదేవరపల్లి, పరకాలలో 788 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 55 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో భీమదేవరపల్లిలో 23, హనుమకొండలో 19, పరకాలలో 13 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకిగాను ఇచ్చిన నోటిఫికేషన్లో అత్యధికంగా హనుమకొండ ప్రాజెక్ట్కు 953 దరఖాస్తులు అందాయి.


