దుగ్గొండి: ‘సార్.. మా అమ్మానాన్న చనిపోయారు.. అనాథలుగా మిగిలాం.. అమ్మమ్మ, తాతయ్యలు ముసలివారు.. చేతిలో చిల్లిగవ్వలేని వారి జీవితం.. ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు.. ప్లీజ్ మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వండి’ అంటూ ఇద్దరు అనాథలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కోరిన సంఘటన మండలంలోని తొగర్రాయి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సదిరం వీరయ్య తన కూతురు కల్ప నను రేకంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె జన్మించారు. అనంతరం కల్పన ఆమె భర్త చనిపోయారు. దాంతో అనాథలుగా మిగిలిన పిల్లలు రిత్విక్, చిట్టిని తాత సదిరం వీరయ్య చేరదీశాడు. పేద కుటుంబానికి చెందిన వీరయ్య చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. తెలిసిన వారు అందిస్తున్న ఆర్థిక సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను సాకుతున్నాడు. ఈ క్రమంలో తొగర్రాయి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని అనాథ బాలుడు రుత్విక్ కలిసి వెళ్లి తమ దీనగాథను వివరించాడు. ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దొంతి.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి కట్టించి అందిస్తానని, ఇద్దరి చదువులకు తనవంతు సహాయం అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే దొంతిని వేడుకున్న
అనాథ బాలలు


