సాక్షి ప్రతినిధి, వరంగల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేవకముందే రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు ఓటర్ల నమోదును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడి పేరును ఓటరు జాబితాలో చేర్పించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా కసరత్తు చేస్తున్నాయి.
మూడు పార్టీల అభ్యర్థుల ఖరారు
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పేరు, బీఆర్ఎస్ ఏనుగుల రాకేశ్‌రెడ్డి, జనసేన మాజీ డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) గడల శ్రీనివాసరావును ఖరారు చేసింది. దీంతో మూడు పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని భావిస్తోంది. బీఆర్ఎస్ తన కేడర్‌ను పూర్తిస్థాయిలో రంగంలోకి దించి, గత ఎన్నికల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. జనసేన మాత్రం పట్టభద్రులు, యువతలో తనకు ఉన్న మద్దతును ఓట్లుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, బీజేపీ అభ్యర్థిత్వంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు ఎస్.ప్రకాశ్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, నూకల నర్సిరెడ్డి, రాణిరుద్రమ, కాసం వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. చివరకు ఆ పార్టీ నుంచి ఎవరిని బరిలోకి దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
నమోదే తొలి మెట్టు.. గెలుపే టార్గెట్
ప్రస్తుతం పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారం కంటే ముందుగా ఓటరు నమోదుపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఉద్యోగ వర్గాలు, యువత, పట్టణాలు, మండలాల వారీగా పట్టభద్రుల వివరాలను సేకరిస్తున్నారు. పార్టీ నాయకులు తమ పరిధిలోని పట్టభద్రులతో నేరుగా మాట్లాడి ‘ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?’ అంటూ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. అర్హత ఉన్న పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రధాన పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ వెళ్తున్నారు. ముఖ్యంగా కొత్తగా డిగ్రీ పూర్తిచేసినవారు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఓటరు నమోదుపై ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఎంతమంది అర్హులైన పట్టభద్రులు ఉన్నారు, ఎంతమంది ఇప్పటికే నమోదు చేసుకున్నారు, ఇంకా ఎంతమందిని నమోదు చేయించాలి అనే లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది.
నోటిఫికేషన్ రాకముందే కార్యాచరణ
2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. ఇందుకు సంబంధించి నవంబర్ 6 వరకు గడువు ఉంది. ఈ గడువు ముగిసేలోపు అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాయి. అధికార యంత్రాంగం ఒకవైపు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా.. రాజకీయ పార్టీలు మరోవైపు తమ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి నల్లగొండ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్‌ను ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా (ఈఆర్వో) నియమించారు. ఓటర్ల నమోదు, జాబితా తయారీ తదితర ఎన్నికల ప్రక్రియను ఆయన పర్యవేక్షించనున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా.. ఉమ్మడి వరంగల్‌లో రాజకీయ పార్టీలు మాత్రం తమదైన శైలిలో ముందస్తు మంత్రాంగం ప్రారంభించాయి. ప్రధానంగా పట్టభద్రుల ఓటరు జాబితాలో తమకు అనుకూలంగా ఉన్న వర్గాల నమోదును పెంచడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
ప్రజా నోటీసు: సెప్టెంబర్ 28
ఫారం–18 దరఖాస్తుల స్వీకరణ:
సెప్టెంబర్ 28 నుంచి
దరఖాస్తుల చివరి తేదీ: నవంబర్ 6
ముసాయిదా ఓటర్ల జాబితా: నవంబర్ 25 క్లెయిమ్‌లు, అభ్యంతరాలు:
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10
క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం:
డిసెంబర్ 25లోగా
తుది ఓటర్ల జాబితా: డిసెంబర్ 30
పట్టభద్రులను ఓటర్లుగా
చేర్పించేందుకు ప్రధాన పార్టీల దృష్టి
నవంబర్ 6 వరకు గడువు.. గెలుపు కోసం నేతల మంత్రాంగం
ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఖరారు కాని కమలం అభ్యర్థి
ఇదీ ఓటర్ల నమోదు షెడ్యూల్..


