పండుగైనా పైసలిస్తలేరు! | - | Sakshi
Sakshi News home page

పండుగైనా పైసలిస్తలేరు!

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

సాక్షి, వరంగల్‌: జిల్లాలో రెండు నెలలుగా భూ రీసర్వే జోరుగా జరుగుతోంది. మండుటెండల్లో ఆ భూమిని కొలుస్తున్నా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు మాత్రం పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ఇంటి అవసరాలు, కుటుంబ పోషణ కోసం ఉపయోగపడుతాయనుకున్న వేతనాలు సరిగా రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ, ప్రభుత్వ సర్వేయర్లు ఉన్న వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రైవేట్‌ లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు మొరపెట్టుకుంటున్నా అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రీసర్వేపై ప్రభావం చూపే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఇతర జిల్లాల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. వరంగల్‌ జిల్లాలోని 33 మంది సర్వేయర్లకు ఇంకా వేతన కష్టాలు రెండు నెలలుగా అలాగే ఉన్నాయి. 15 రోజులకొకసారి ఆయా సర్వేయర్లు చేసిన పని డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ఫలితంగా ఓ మండలంలోని గ్రామంలో రీసర్వే చేస్తున్న ఓ లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో వేతనాలివ్వాలని పోస్టు చేయడం, ఆ తర్వాత రోజు విధులకు దూరంగా ఉండడం వివాదాస్పదమవుతోంది. సర్వేయర్లు సర్వేకు దూరంగా ఉంటే ప్రభుత్వ ఉద్దేశం నీరుగారిపోయే ప్రమాదం ఉంది. దీనికితోడు మండుటెండల్లో భూములు కొలుస్తున్న సర్వేయర్లకు నీడ, నీటి సౌకర్యం, భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన కిట్‌లను ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఖాతాలు తీసుకొని నెలరోజులైనా..

‘సర్వేయర్లకు కష్టాలు, ఎకరాకు రూ.60 మాత్రమే చెల్లింపు’ శీర్షికన గత నెల 12న సాక్షిలో కథనం ప్రచురితం కాగానే ఆయా సర్వేయర్ల నుంచి బ్యాంకు ఖాతాలు అధికారులు తీసుకున్నారు. నెలరోజులు గడిచినా ఇప్పటివరకు వేతనాలు డిపాజిట్‌ చేయలేదు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10,000 ఎకరాల వరకు కొలిచిన 33 మందికి కలిపి చెల్లించేది రూ.6 లక్షలవుతుంది. 33 మందికి కలుపుకుంటే ఒక్కొక్కరికి సరాసరి రూ.18,181 చెల్లించాల్సి ఉంటుంది. ‘ఉదయం ఫీల్డ్‌ మీదకి వెళ్లగానే 9 గంటల్లోపే ఆ భూమిపై రీ సర్వే ప్రారంభమైనట్లు ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. కొన్ని సందర్భాల్లో రైతులు గెట్టు విషయంలో సహకరించకున్నా వాళ్లను ఒప్పించేందుకు కూడా సమయం అయిపోతుంది. పురుషులతో పాటు సమానంగా మహిళా సర్వేయర్లు ఉండడంతో వారికి క్షేత్రస్థాయిలో మరింత ఇబ్బందిగా ఉంది. అన్ని విషయాల్లో నిబంధనలంటున్న అధికారులు తమ పనికి వేతనం ఇచ్చే విషయంలో మాత్రం పాటించడం లేదు’ అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సర్వేయర్‌ వాపోతున్నారు. ఎవరైనా ఈ విషయమై ప్రశ్నిస్తే సంబంధిత ప్రభుత్వ సర్వేయర్లకు నోటీసులు జారీ చేయడం పరిపాటిగా మారిందంటున్నారు. ఈ వేతనాల విషయమై జిల్లా సర్వే, భూరికార్డుల శాఖ ఏడీ శ్రీనివాస్‌ను ఫోన్‌లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు.

‘మా ఆవిడకి ప్రెగ్నెన్సీ.. కనీసం ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు నా దగ్గర డబ్బులు లేవు. కాస్త మేం చేసిన పనికి డబ్బులు ఇ ప్పించండి’ అంటూ ఓ సర్వేయర్‌ రీసర్వే వాట్సాప్‌ గ్రూప్‌లో దీనంగా పోస్టు చేశారు.

‘వర్ధన్నపేట నక్ష సర్వే చేశాం. ఇప్పుడు భూముల రీ సర్వే చేస్తున్నాం. అయినా ఇప్పటివరకు ఆ నక్ష సర్వే పనులకు, ఇప్పుడు చేసిన పనికి వేతనాలు ఇవ్వలేదు. మాకు ఫ్యామిలీలు, పండుగలు ఉన్నాయి.. కాస్త ఇప్పించండి’ అంటూ మరొకరు

వేదనతో పోస్టు చేశారు.

రెండు నెలలవుతున్నా జిల్లాలోని

సర్వేయర్లకు అందని వేతనాలు

10 వేల ఎకరాలు సర్వే చేసినా

డబ్బులివ్వకపోవడంతో ఇబ్బందులు

33 మందికి రూ.6 లక్షలు

చెల్లించేందుకు అధికారుల జాప్యం

15 రోజులకొకసారి ఇవ్వాలనే

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement