మనసు మాట వినాలి | - | Sakshi
Sakshi News home page

మనసు మాట వినాలి

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

అనవసర ఆలోచనలు మానుకోవాలి

విశ్రాంతి అవసరం

మౌనం వద్దు..
మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరగాలి

కాళోజీ సెంటర్‌: శారీరక ఆరోగ్యంపై చూపుతున్న శ్రద్ధను మానసిక ఆరోగ్యంపైన కూడా చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు, సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించే తాము.. ఆందోళన, నిరాశ, ఒంటరితనం, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్న వారిని మాత్రం పట్టించుకోకపోవడం ఆందోళనకరమని వారు పేర్కొంటున్నారు.

కనిపించని గాయాలను గుర్తించాలి

ప్రతి చిరునవ్వు ఆనందానికి సంకేతం కాదు.. ప్రతి నిశ్శబ్దం ప్రశాంతతకు చిహ్నం కాదు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల సంక్షోభం, ఉద్యోగ భద్రత, విద్యాపోటీ తదితర కారణాలతో ఎంతోమంది మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే, వారి బాధను చిన్న విషయంగా కొట్టిపారేయకుండా అర్థం చేసుకోవడం, ఓపికగా వినడం చాలా అవసరం.

విద్యార్థులపై మార్కుల ఒత్తిడి

పిల్లల చేతిలో పుస్తకాలు ఉన్నాయా..? ఎన్ని మార్కులు వచ్చాయి..? అనే విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్న తల్లిదండ్రులు.. నువ్వు ఎలా ఉన్నా వు..? అని కూడా అడగాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, పోటీలో ఓడిపోవడం లేదా ఉద్యోగం రాకపోవడం జీవితానికి ముగింపు కాదనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. విజయంతో పాటు వైఫల్యాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా నేర్పాలి.

ఒత్తిడితో అలసట..

ఆధునిక జీవితం సౌకర్యాలను పెంచినప్పటికీ ఒత్తిడిని కూడా పెంచింది. విద్యార్థులకు చదువు, యువతకు ఉద్యోగం – కెరీర్‌, ఉద్యోగులకు పని భారం, కుటుంబాలకు ఆర్థిక సమస్యలు, వృద్ధులకు ఒంటరితనం వంటి అంశాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.

మౌనం కాదు.. సంభాషణే తొలి అడుగు

ఎవరైనా అకస్మాత్తుగా మౌనంగా మారితే ఏమైంది? అని అడగాలి. నేను నీతో ఉన్నాను అనే భరోసా ఇవ్వాలి. వారి సమస్యకు వెంటనే తీర్పు ఇవ్వకుండా వినాలి. ఒక్కోసారి పెద్ద ఉపన్యాసం కంటే శ్రద్ధగా వినే చెవి, ఆప్యాయమైన మాట, చిన్న చేయూతే ఒక వ్యక్తిలో ఆశను నింపగలదు.

సాయం కోరడం అవమానం కాదు..

కౌన్సిలర్‌ను సంప్రదించడం, సైకాలజిస్ట్‌ సహాయం తీసుకోవడం అవమానం కాదు. మానసిక బాధ గురించి మాట్లాడటం ఓటమి కాదు. సమస్యను గుర్తించి సహాయం కోరడం జీవితంపై బాధ్యతతో తీసుకునే నిర్ణయంగా చూడాలి. శారీరక అనారోగ్యానికి వైద్యుడిని సంప్రదించడం ఎంత సహజమో.. మానసిక సమస్యలకు కూడా నిపుణుల సహాయం పొందడం అంతే సహజంగా మారాలి.

సహాయం కోరడం బలహీనత కాదు..

ధైర్యానికి నిదర్శనం

నేడు ప్రపంచ మానసిక

ఆరోగ్య దినోత్సవం

కాశిబుగ్గ: మానసిక సమస్య అంటే అదొక కుంగదీసే జబ్బుగా పరిగణించరాదు. దాన్ని షుగర్‌, బీపీ లాంటి ఒక సాధారణ సమస్యగానే భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు.

ఎంజీఎంలో మానసిక

వ్యాధులకు చికిత్స

మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి తగిన చికిత్స అందించి, వారిలో మానసిక స్థైర్యం పెంపునకు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కేంద్రాలు ఉన్నాయి. మానసిక ఆరోగ్య విభాగం, మానసిక చికిత్స వార్డుతో పాటు డీఅడిషన్‌ కౌన్సిలింగ్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. ముగ్గురు వైద్య నిపుణులు, 12 మంది పీజీలు, నలుగురు ఎస్‌ఆర్‌లు పనిచేస్తున్నారు. రోజు దాదాపు 80 నుంచి వంద వరకు ఓపీ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇన్‌పేషెంట్‌ కోసం ప్రత్యేకంగా 40 పడకల వార్డును ఏర్పాటు చేశారు. అలాగే, 20 పడకలతో ప్రత్యేకంగా డీఅడిక్షన్‌ సెంటర్‌ను సిద్ధం చేశారు. జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు వైద్య నిపుణులు, ఒకరు చొప్పున ఎస్‌ఆర్‌లు, భూపాలపల్లి, నర్సంపేటలలో ఒకరు చొప్పున వైద్య నిపుణులు బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

మనిషి యంత్రం కాదు. ఎప్పుడూ విజయవంతంగా, ఉత్పాదకంగా ఉండాల్సిన అవసరం లేదు. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. పిల్లల మాట వినాలి.. వృద్ధులను పలకరించాలి.. స్నేహితుడి మౌనాన్ని గమనించాలి.. సహోద్యోగి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. బాధలో ఉన్నవారిని ఎగతాళి చేయకుండా, తీర్పు ఇవ్వకుండా అండగా నిలవాలి. మానసిక ఆరోగ్యం విలాసం కాదు.. అది ప్రతి ఒక్కరి హక్కు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement